Donald Trump | ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తహతహలాడిపోతున్నారు. నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) విజేతను నోబెల్ కమిటి శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు టెన్షన్ పట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తనకు వస్తుందో..? రాదో..? అన్న భయంతో నిద్రకూడా పట్టనట్లు కనిపిస్తోంది.
తాను భారత్-పాక్‌తోపాటూ మొత్తం ఎనిమిది యుద్ధాలు ఆపానని అందుకు గానూ తనకు నోబెల్ బహుమతి రావాలని కోరుకుంటున్నారు. తనను తాను పీస్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నేడు నోబెల్ శాంతి ప్రకటన నేపథ్యంలో తాజాగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama)పై తన అక్కసు వెళ్లగక్కారు. ఒబామా ఏమీ చేయకపోయినా తనకు నోబెల్ శాంతి ఇచ్చారని.. ఎనిమిది యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో, రాదో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
వైట్‌హౌస్ వద్ద విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ.. గాజాలో శాంతికి మధ్యవర్తిత్వం వహించడంతో సహా తాను ఎనిమిది యుద్ధాలు ఆపడంలో విజయం సాధించానంటూ చెప్పుకొచ్చారు. ఇక ఒబామాకు నోబెల్ శాంతి లభించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ‘అతను (ఒబామాను ఉద్దేశిస్తూ) ఏమీ చేయలేదు. అయినా ఆ బహుమతి పొందారు. అది ఎందుకిచ్చారో అతనికి కూడా తెలియదు. యూఎస్‌ను నాశనం చేసినందుకే ఆయనకు ఆ బహుమతిని ఇచ్చారు. నేను ఎనిమిది యుద్ధాలను ఆపాను. అయినా వారు ఏం చేయలేదు. నేనేమీ శాంతి బహుమతి కోసం ఇదంతా చేయలేదు. ప్రజల ప్రాణాలను కాపాడి, ప్రంపచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకే చేశాను’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ట్రంప్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా, అమెరికా అధ్యక్షుల్లో ఇప్పటివరకూ నలుగురికి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. థియోడోర్ రూస్వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాలను ఈ బహుమతి వరించింది. ఒబామాను 2009లో ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ సహకారం పెంపొందించేలా చేయడం, దౌత్యం, అణ్వాయుధ నిర్మూలకు కృషి చేసినందుకుగాను ఆయనకు నోబెల్ శాంతి వరించింది. ఈసారి నోబెల్ శాంతి బహుమతి నామినీల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. దీంతో నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉంటాడో? లేదో? మరికొన్ని గంటల్లో తేలనుంది.
స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ (Alfred Nobel) పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న విషయం తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నెబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన జ్ఞపకార్థం ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ లిటరేచర్‌లో నోబెల్ ప్రకటించింది. ఇక రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (Royal Swedish Academy of Sciences) శుక్రవారం (నేడు) నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించనుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది.
Also Read..
Nobel Peace Prize | నేడు నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ట్రంప్‌కు దక్కేనా?
భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించండి
గాజాలో శాంతి వీచికలు.. కాల్పుల విరమణ, బందీల అప్పగింతపై ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం