వాషింగ్టన్, అక్టోబర్ 9: టారిఫ్‌ల పెంపు కారణంగా భారత్‌తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికాకు చెందిన 19 మంది చట్టసభ సభ్యులు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక లేఖ రాశారు. ఈ లేఖపై సంతకం పెట్టినవారిలో దెబోరా రాస్, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, రాజాకృష్ణమూర్తి వంటి నాయకులు ఉన్నారు. కాగా లేఖ రాసినవారందరూ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారే కాగా, ఒక్కరు కూడా అధికార రిపబ్లికన్ పార్టీకి చెందినవారు లేకపోవడం గమనార్హం.
‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు వ్యతిరేకంగా మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉభయ దేశాల మధ్య కీలక భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి. టారిఫ్ విధానాన్ని సమీక్షించాలి, భారత నాయకత్వంతో సంప్రదింపులు కొనసాగించాలి’ అని వారు సూచించారు. ట్రంప్ తీసుకున్న చర్యల కారణంగా చైనా, రష్యాలకు భారత్ చేరువైందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.