Nobel Peace Prize | ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) విజేతను నోబెల్ కమిటి శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో తనను తాను పీస్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు (Donald Trump) ఎక్కడ లేని టెన్షన్ పట్టుకుంది. భారత్, పాక్ యుద్ధం సహా ఏడు యుద్ధాలు ఆపానని, ఈ ఏడాది తనకు నోబెల్ బహుమతి రావలని, లేదంటే అమెరికాను అవమానించినట్లేనని బెదిరింపులకు దిగుతున్నారు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే తనకు పీస్ ప్రైజ్ ఎందుకు దక్కదంటూ, తాను అన్ని విధాల అర్హుడినని ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ ఏడాదికి నోబెల్ బహుమతుల ప్రకటన మొదలైన తర్వాత ట్రంప్ మరింత బలంగా డిమాండ్ వినిపిస్తున్నారు. గాజాలో శాంతికి అమెరికా ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికను ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని, కాల్పుల విరమణకు సంతకాలు చేసిన తర్వాత నోబెల్ శాంతి బహుమతికి తన పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. పాక్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ట్రంప్‌ను శాంతి బహుమతికి నామినేట్ కూడా చేశాయి. అయితే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ బహుమతికి ట్రంప్ అసలు అర్హుడేనా సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఎందుకంటే పాలస్తీనా దురాక్రమణకు ఇజ్రాయెల్‌ను ఎగదోస్తున్నదే అమెరికా కాబట్టి. ఇక రష్యాపై పోరుకు ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తున్నది కూడా అగ్రరాజ్యమే కావడం గమనార్హం. అదేవిధంగా అఫ్ఘానిస్థాన్‌లో తాము నిర్మించిన ఎయిర్ బేస్‌ను బలవంతంగానైనా ఆక్రమిస్తామని, కెనడా కూడా అమెరికా భూభాగమేనని, దానిని తమ దేశంలో మరో రాష్ట్రంగా గుర్తిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటనలు చేశారు.
కాగా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, హమాస్-ఇజ్రాయెల్ పోరు సహా పలు దేశాలలో సంఘర్షణల నడుమ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఈ ప్రతిష్ఠాత్మక బహుమతికి మొత్తం 338 ఎంట్రీలు వచ్చాయి. నార్వే పార్లమెంట్ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ వాటిని పరిశీలించి విజేతను ఎంపిక చేస్తుంది. యుద్ధం, కరువు సమయాల్లో పౌరులకు సహాయం చేయడానికి తమ ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా పనిచేసే స్వచ్ఛంద సేవకుల నెట్వర్క్ అయిన సూడాన్ అత్యవసర ప్రతిస్పందన బృందం, రష్యన్ ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ సతీమణి యులియా నావల్నీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రసిద్ధ ఎన్నికల మానిటర్ ఆఫీసర్ ఫర్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హ్యూమన్ రైట్స్ (OSCE) కూడా ఈ ఏడాది శాంతి బహుమతికి పోటీలో ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే బహుమతి కోసం ఎవరెవరి పేర్లు వచ్చాయో వచ్చే 50 ఏండ్ల పాటు రహస్యంగా ఉంచనున్నారు. గతేడాది నోబెల్ శాంతి బహుమతిని నిహాన్ హిడాంక్యోకు ప్రదానం చేశారు.
కాగా, అమెరికా అధ్యక్షుల్లో ఇప్పటివరకూ నలుగురికి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. థియోడోర్ రూస్వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాలను ఈ బహుమతి వరించింది. రష్యా-జపాన్ యుద్ధం ముగింపులో కీలకంగా వ్యవహరించిన థియోడోర్ రూస్వెల్ట్ (Theodore Roosevelt) 1906లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. దీంతో ఈ ప్రైజ్ గెలుచుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిగా రూస్‌వెల్డ్ నిలిచారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు, లీగ్ ఆఫ్ నేషన్స్ అనే అంతర్జాతీయ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినందుకు గాను 1919లో వుడ్రో విల్సన్‌కు శాంతి బహుమతి లభించింది. ఇక 2002లో జిమ్మీ కార్టర్‌కు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కింది. అంతర్జాతీయ ఘర్షణలకు ముగింపు పడేలా చేయడంతో పాటు మానవహక్కుల పరిరక్షణ కోసం చేసిన కృషికి గాను ఆయనకు అవార్డు అందజేశారు. అంతర్జాతీయ సహకారం పెంపొందించేలా చేయడం, దౌత్యం, అణ్వాయుధ నిర్మూలకు కృషి చేసినందుకుగాను 2009లో బరాక్ ఒబామాకు (Barack Obama) నోబెల్ బహుమతి వరించింది. ఈసారి నోబెల్ శాంతి బహుమతి నామినీల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. దీంతో నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉంటాడో? లేదో? మరికొన్ని గంటల్లో తేలనుంది.
THE PEACE PRESIDENT. pic.twitter.com/bq3nMvuiSd
— The White House (@WhiteHouse) October 9, 2025