Instagram : సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్స్టాగ్రామ్ త్వరలో కీలక ఫీచర్ ప్రవేశపెట్టబోతుంది. ఇన్స్టాగ్రామ్ వాడుతున్న యువత ఆత్మహత్య చేసుకోవడాన్ని వీలైనంత నియంత్రించేలా ఈ ఫీచర్ ఉండనుంది. 16 ఏళ్లలోపు పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో సూసైడ్ సంబంధిత కంటెంట్ సెర్చ్ చేస్తే వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చేలా కొత్త అలర్ట్ సిస్టమ్‌ను ఇన్స్టాగ్రామ్ తీసుకురానుంది.
సోషల్ మీడియా చాలా మందిపై దుష్ప్రభావం చూపిస్తుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా యువత దీనివల్ల చెడు ప్రభావానికి లోనవుతున్నారు. అందుకే ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలు 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నాయి. కొన్ని దేశాలు టీనేజ్ యువత ఎస్ఎం వాడకుండా చూస్తున్నాయి. స్పెయిన్, గ్రీస్, స్లొవేనియా దేశాలు కూడా యువత సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపాయి. అలాగే మన దేశంలో ఏపీ, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా ముందుగానే యువతకు ఉపయోగపడేలా ఫీచర్ తీసుకురావాలని నిర్ణయించింది. దీని ప్రకారం 16 ఏళ్లలోపు ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ ప్లాట్‌ఫాంపై సూసైడ్, లేదా సంబంధిత హానికర కంటెంట్‌ను సెర్చ్ చేస్తే వెంటనే వారి పేరెంట్స్‌కు అలర్ట్ ఇస్తుంది.
అతి తక్కువ సమయంలోనే ఈ అలర్ట్ వెళ్తుంది. వచ్చే వారం నుంచే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఆన్లైన్ ద్వారా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి ఆలోచనల్ని నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుందని మెటా తెలిపింది. ఈ ఫీచర్ వాడే విషయంలో సెట్టింగ్స్‌లో కొన్ని కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దుష్ప్రభావాల్ని తగ్గించడానికి అనేక దేశాలు ప్రయత్నిస్తుండగా, మెటా, ఎక్స్ వంటి సంస్థలు కూడా ఈ దిశగా ముందడుగు వేస్తున్నాయి.