– పోస్టుమార్టం నిర్వహించిన ఎయిమ్స్ వైద్యులు
– దోషులకు శిక్ష పడేదాకా ఉద్యమం ఆగదు
– మందకృష్ణ మాదిగ
కోదాడ, ఫిబ్రవరి 27 : పోలీస్ కస్టడీలోనే కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ దుర్మరణం చెందాడనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ఎయిమ్స్ బీబీనగర్‌కు చెందిన వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో కేసుకు సంబంధం లేని అమాయకుడైన రాజేశ్‌పై పోలీసులు అక్రమ కేసులు బనాయించి కస్టడీలో చిత్రం హింసలు పెట్టడం వల్లే మృతి చెందాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు దళిత సంఘాలు, బీఆర్ఎస్ నాయకుల ఆందోళన నేపథ్యంలో ఎస్సీ జాతీయ కమిషన్ ఆదేశాల మేరకు ఈ పోస్టుమార్టం నిర్వహించారు. రాజేశ్ దుర్మరణం వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. రాజేశ్ మృతి చెంది మూడు నెలలు కావస్తున్నప్పటికీ అందుకు కారణమైన చిలుకూరు ఎస్ఐ ని సస్పెండ్ చేయకపోవడం పట్ల గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రాజేశ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేదాకా మందకృష్ణ మాదిగ తోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు అక్కడే ఉన్నారు. రాజేశ్ మృతికి ప్రధాన కారణమైన దోషులకు శిక్ష పడేదాకా తమ ఉద్యమం ఆగదని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వాస్తవాలు తెలిసినప్పటికీ చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేయకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.