జెరూసలెం/కైరో, అక్టోబర్ 9: రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel Hamas War) ముగింపు దిశగా ఎట్టకేలకు తొలి అడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన తొలి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్-పాలస్తీనా తీవ్రవాద గ్రూపు హమాస్ గురువారం సంతకాలు చేశాయి. ఒప్పందం కింద కాల్పుల విరమణ జరుగుతుంది. గాజా (Gaza) నుంచి ఇజ్రాయెల్ తన బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటుంది. తాను బంధించిన బందీలందరినీ హమాస్ విడుదల చేస్తుంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా తన అధీనంలో ఉన్న వందలాది మంది పాలస్తీనా బందీలను విడుదల చేస్తుంది. ఒప్పందం కుదిరినట్లు ప్రకటన వెలువడిన వెంటనే ఇజ్రాయెల్, పాలస్తీనా పౌరులు హర్షం వ్యక్తం చేశారు. ఈజిప్టులోని షార్మ్ ఎల్-షేక్ బీచ్ రిసార్టులో ముఖాముఖీ చర్చల అనంతరం ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు ఇరు పక్షాల అధికారులు ధ్రువీకరించారు. రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌పై హమాస్ అనూహ్య దాడితో యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 67,000 మందికిపైగా పాలస్తీనా పౌరులు మరణించారు. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది ఇళ్లు నేలమట్టం కాగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులై టెంట్లలో తలదాచుకుని జీవిస్తున్నారు. వేలాదిమంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. ఈ ఒప్పందంతో ఆహారాన్ని, మందులను తీసుకుని ట్రక్కులు ఇక గాజాలోకి ప్రవేశించడానికి మార్గం ఏర్పడింది.
ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు. రెండేండ్లుగా సాగుతున్న గాజా యుద్ధాన్ని ముగించేందుకు ఇదో గొప్ప అడుగు అని అభివర్ణించారు. ‘శాంతి ప్రణాళిక తొలిదశ ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని ప్రకటించేందుకు గర్వంగా భావిస్తున్నాను. ఈ నిర్ణయంతో హమాస్ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదలవుతారు. ఇజ్రాయెల్ తన బలగాలను ఉపసంహరించుకుంటుంది. దీర్ఘకాలిక శాంతిని సాధించే క్రమంలో ఇది తొలి అడుగుగా నిలిచిపోతుంది. అన్ని పక్షాలను సమంగా చూస్తాం. అరబ్, ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్, ఇతర చుట్టుపక్కల దేశాలు, అమెరికాకు ఇదొ గొప్ప రోజు’ అని పేర్కొన్నారు.
ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ‘శాంతి ప్రణాళిక మొదటి దశ ఒప్పందానికి ఆమోదంతో, బందీలందరినీ ఇంటికి తీసుకొస్తాం. ఇది ఇజ్రాయెల్‌కు దౌత్యపరమైన విజయం. బందీలందరినీ తిరిగి తీసుకురావడం, మా లక్ష్యాలను సాధించే వరకు విశ్రాంతి తీసుకోబోమని మొదటి నుంచీ చెబుతున్నాం. నా మిత్రుడు, ట్రంప్ గొప్ప ప్రయత్నాల ద్వారా ఈ కీలక మలుపునకు చేరుకున్నాం. ఆయనకు కృతజ్ఞతలు’ అని నెతన్యాహు పేర్కొన్నారు.
యుద్ధం అంతానికి ప్రధాన చర్యను ప్రతిపాదించి గాజా శాంతి ఒప్పందాన్ని విజయవంతం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై కూడా తాను ట్రంప్‌తో మాట్లాడినట్లు గురువారం ఎక్స్ పోస్టులో మోదీ వెల్లడించారు. రానున్న వారాలు మరింత క్రియాశీలకంగా ఉండగలవని కూడా ఆయన సూచించారు. తన మిత్రుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడి చారిత్రాత్మక గాజా శాంతి ఒప్పందం విజయవంతం కావడంపై అభినందనలు తెలియచేశానని మోదీ తెలిపారు. వాణిజ్య చర్చలలో సాధించిన పురోగతిని కూడా తాము సమీక్షించామని, రానున్న వారాలలో మరింతగా అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నామని ఆయన వెల్లడించారు.
ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కూడా పరిస్థితులు మళ్లీ మారవచ్చని పాలస్తీనా వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ బందీలుగా ఉన్న పాలస్తీనా జాతీయుల విడుదల జాబితాను సిద్ధం చేయాల్సి ఉందని వారు చెప్పారు. వీరిలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారని, వీరుగాక వందలాది మంది పాలస్తీనీయులు ఇజ్రాయెల్‌లో బందీలుగా ఉన్నారని వారు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలోని ఇతర చర్యలను కూడా ఉభయ పక్షాలు చర్చించాల్సి ఉందని వర్గాలు తెలిపాయి. గాజా స్ట్రిప్ పాలనా బాధ్యతలు ఎవరు చేపట్టాలి, ఆయుధాలు విసర్జించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్‌ను హమాస్ అంగీకరిస్తుందా వంటి అంశాలు కూడా చర్చించాల్సి ఉంటుందన్నారు.