వాషింగ్టన్: అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరికలను రష్యా పెడచెవిన పెట్టింది. ఇకేముంది ట్రంపు సారుకు చిర్రెత్తుకొచ్చింది. మాస్కోను ఏమీ చేయలేక తన అక్కసును భారత్‌పై వెళ్లగక్కుతున్నారు. పుతిన్ నుంచి పెద్ద మొత్తం చమురు కొనుగోలు చేస్తున్న మన దేశంపై పడ్డారు. అసలే కోతి ఆపై కల్లు తగింది అన్న చందంగా.. న్యూఢిల్లీ నుంచి అమెరికాకు చేసే ఎగుమతులపై భారీగా సుంకాలు (Trump Tariffs) విధిస్తున్నారు. మొదట 25 శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అది గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకోకపోవడంతో అదనంగా మరో 25 శాతం టారీఫ్‌లు విధిస్తున్నామని, అవి ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయని బుధవారం సాయంత్రం చెప్పారు. అయినా భారత్ మాత్రం తమ చమురు అవసరాలే తమకు ప్రధానమని ప్రకటించింది. తామొక్కరినే బాధ్యులను చేస్తే ఎలా అని అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారత్‌పై సెంకడరీ శాంక్షన్స్ విధించే అవకాశం ఉందన్నారు. భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేకుంటుండటమే దీనికి కారణమని చెప్పారు. అధ్యక్ష భవనంలో జరిగిన ఒక ప్రెస్ బ్రీఫింగ్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఈమేరకు హెచ్చరించారు.
రష్యా నుంచి భారత్ మాత్రమే చమురు కొనడం లేదని, చైనా లాంటి దేశాలు కూడా ఉన్నాయని ఓ మీడియా ప్రతినిధి ట్రంప్‌ను అడిగారు. ప్రత్యేకంగా భారత్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ.. ఇప్పటికి 8 గంటలు మాత్రమే అయ్యింది. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. మీరు సెకండరీ ఆంక్షలు చూడబోతున్నారని వ్యాఖ్యానించారు. రష్యా కాల్పుల విరమణకు అంగీకరిస్తే న్యూఢిల్లీపై సుంకాలు తగ్గే అవకాశం సూచనప్రాయంగా వెల్లడించారు.
చైనాపై కూడా ఇలాంటే అదనపు టారిఫ్‌లు వేయాలనే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి అది కూడా జరగవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌పై అదనపు టారీఫ్‌లో విధించామని, మరో రెండు దేశాలపై చర్యలు ఉంటాయన్నారు. అయిలో బీజింగ్ కూడా ఉండొచ్చని చెప్పారు. మాస్కో చమురు కొనుగోలు చేసే వారిపై పెనాల్టీలు కొనసాగుతాయని మరోసారి స్పష్టం చేశారు.
మరో 25 శాతం బాదుడు.. చైనా కంటే మనపైనే ట్రంప్ అధిక సుంకాలు
Trump Trariffs | ట్రంప్ అదనపు సుంకాలు.. ప్రభావం వేటిపై అంటే..