వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తామని గతంలో పలుమార్లు హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం చెప్పినట్లే చేశారు. భారత్‌పై 25% అదనంగా సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్‌పై అమెరికా విధించిన మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది. అదనంగా విధించిన 25 శాతం సుంకం 21 రోజుల తర్వాత ఆగస్టు 27వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ట్రంప్ సంతకంతో జారీ అయిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెల్లడించింది.
అమెరికన్ వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలకు ప్రతీకారంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ దిగుమతులపై విధించిన 25% అసలు సుంకం ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చింది. తాము నిలిపివేయాలని హెచ్చరించినప్పటికీ వినకుండా రష్యా నుంచి చమురు దిగుమతిని కొనసాగిస్తున్నందుకు భారత్‌పై అదనంగా 25 శాతం సుంకం విధిస్తూ బుధవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు.
రానున్న 24 గంటల్లో భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తామని మంగళవారం హెచ్చరించిన ట్రంప్ మరుసటి రోజు చెప్పినట్లే చేశారు. నేపథ్యం, సుంకాలు, సుంకాల పరిధి తదితర అంశాలతో కూడిన 9 సెక్షన్లు పొందుపరిచిన ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తూ, అమెరికా విదేశాంగ విధానాన్ని దెబ్బతీస్తున్న రష్యా నుంచి చమురు, ఇంధనంతోసహా వివిధ వస్తువుల దిగుమతిని నిషేధించేందుకు అమలులో ఉన్న వివిధ చట్టాలను తన ఆర్డర్లో ట్రంప్ పేర్కొన్నారు.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14066లో అభివర్ణించిన జాతీయ ఎమర్జెన్సీని ఎదుర్కొనేందుకు రష్యన్ చమురును ప్రత్యక్షంగా లేక పరోక్షంగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు చెందిన వస్తువుల దిగుమతిపై అదనపు సుంకాన్ని విధించడం అవసరమని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. తమ చర్యకు ప్రతిస్పందనగా ఏ దేశమైనా ప్రతీకార చర్యకు పాల్పడితే తన ఉత్తర్వును సవరించి మరింత కఠినంగా వ్యవహరిస్తానని ట్రంప్ హెచ్చరించారు. రష్యన్ చమురును ఇతర దేశాలేవైనా దిగుమతి చేసుకుంటున్నాయా అన్న విషయాన్ని గుర్తించి, ఎంత శాతం సుంకాలు వడ్డించాలో తనకు సూచించాలని తన ప్రభుత్వంలోని కీలక శాఖల అధికారులను ట్రంప్ ఆదేశించారు.
రష్యా నుంచి యురేనియం, ఎరువులను అమెరికా కొనుగోలు చేయడం గురించి తనకు తెలియదని ట్రంప్ బుధవారం వెల్లడించారు. రష్యా నుంచి అమెరికా చేసుకుంటున్న దిగుమతుల గురించి భారత్ ప్రశ్నించిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మాస్కోతో వ్యాపారం చేస్తూ తమపైన సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించడం అన్యాయమని భారత్ చేసిన వ్యాఖ్యలు గురించి విలేకరులు ట్రంప్‌ని ప్రశ్నించగా దాని గురించి తనకేమీ తెలియదని బదులిచ్చారు. 2028లో లాస్ ఏంజెలెస్‌లో జరగనున్న ఒలింపిక్ గేమ్స్‌పై చర్చించేందుకు వైట్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.గురువారం రష్యాతో సమావేశం ఉందని, దాని ఫలితం ఏమిటో వేచి చూడాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనంగా మరో 25శాతం సుంకాలు విధించటాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది అన్యాయం, అసమంజసం, అహేతుకమైనదంంటూ భారత విదేశాంగ శాఖ బుధవారం ఆక్షేపించింది. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. ‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశాం. మార్కెట్ అంశాలపై ఆధారపడే మా దిగుమతులు ఉన్నాయి. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రత నిర్ధారించడం మా బాధ్యత. చాలా దేశాలు తమ సొంత ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు విధించడం దురదృష్టకరం’ అని పేర్కొన్నది.
న్యూఢిల్లీ, ఆగస్టు 6: అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌పై సుంకాల మోత మోగిస్తున్నారు. చైనా, కెనడా కంటే అధికంగా భారత్‌పై టారిఫ్‌లు విధించారు. అమెరికా అత్యధికంగా విధించిన సుంకాల జాబితాలో బ్రెజిల్‌తో కలిసి భారత్ సంయుక్తంగా మొదటిస్థానంలో ఉన్నది. ఇరు దేశాలపై ట్రంప్ 50 శాతం టారిఫ్ విధించారు. ఆ తర్వాత స్థానాల్లో స్విట్జర్లాండ్(39 శాతం), కెనడా, ఇరాక్ (35 శాతం చొప్పున), చైనా (30 శాతం) నిలిచాయి.
కాగా, ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు 69 దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం నుంచి 41 శాతం వరకు ప్రతీకార సుంకాలను విధించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 7 నుంచి అమలులోకి వస్తాయి. మెక్సికోతో గతంలో కుదుర్చుకున్న 90 రోజుల ఒప్పందం ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ ఆర్డర్ జారీ అయింది. దీని ప్రకారం ఆగస్టు 7 నుంచి మెక్సికోపై అదనపు సుంకాలు అమలులోకి వస్తాయి.
బ్రెజిల్‌పై గతంలో విధించిన 40 శాతం సుంకం ఆగస్టు 1న అమలులోకి రాగా తాజాగా 10 శాతం ప్రతీకార సుంకాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో ప్రాసిక్యూషన్‌కు అభ్యంతరం తెలియచేస్తూ బ్రెజిల్‌పై సుంకాన్ని ట్రంప్ విధించారు. కెనడాపై విధించిన 35 శాతం సుంకం ఆగస్టు 1న అమలులోకి వచ్చింది.