సిటీ బ్యూరో, బండ్లగూడ, మార్చి 10 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవనం పేరిట చేస్తున్న విధ్వంసాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నది. ప్రజల అభిప్రాయాలు ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు పనులను చకచకా చేస్తున్నారు. అధికారికంగా చేపట్టే పనులను గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రాంతంలో అధికారులు మార్కింగ్‌లు, నోటీసులు జారీ చేస్తారో తెలియక మూసీ పరీవాహక ప్రజలు అయోమయంలో బతుకీడుస్తున్నారు.
ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకెళ్లదీస్తున్నారు. కానీ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఏ మాత్రం కనికరించకుండా తమ పని పూర్తి చేస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ దాకా ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టు పేరిట నది రివర్ బెడ్ నుంచి బఫర్‌జోన్‌ను నిర్ణయిస్తున్నారు. అందుకోసం రివర్బెడ్ నుంచి 50 మీటర్ల దూరాన్ని బఫర్‌జోన్‌గా పేర్కొంటూ మార్కింగులు చేస్తున్నారు. మార్కింగ్ చేసిన ప్రాంతంలో నది పొడవును మీటర్లలో సూచిస్తూ ఎంఆర్డీసీఎల్ పేరున్న స్తంభాలను నాటుతున్నారు.
ఈ పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి బండ్లగూడ జాగీర్ పరిధిలోని కిస్మత్పూర్ దాకా మార్కింగ్ పనులను పూర్తి చేశారు. ఇప్పటిదాకా గుర్తించిన ప్రాంతం దాదాపుగా ప్రభుత్వ స్థలమే. కానీ రివర్ బెడ్, బఫర్‌జోన్‌గా గుర్తించిన స్థలంలో శ్మశాన వాటికలు, గుడులు ఉన్నాయి. వాటిని తొలగిస్తారా? అలానే ఉంచుతారా? ప్రత్యామ్నాయం చూపిస్తారా? అనేది తేల్చకుండా పనులు చేయడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

గుడిని తొలగిస్తే ఊరుకోం..
హిమాయత్‌సాగర్ నుంచి కిస్మత్పూర్ దాకా ప్రస్తుతం రివర్బెడ్ 50 మీటర్ల బఫర్‌జోన్‌ను ఇప్పటిదాకా నిర్ణయించారు. కిస్మత్పూర్ గ్రామంలోని మల్లన్న గుట్ట ప్రాంతంలో అధికారులు గుర్తించిన రివర్బెడ్ ప్రాంతంలో ఏండ్ల నాటి మల్లన్న స్వామి గుడి ఉన్నది. అక్కడ ఏండ్ల తరబడిగా కిస్మత్పూర్ గ్రామస్తులు నిత్య పూజలతో పాటు మల్లన్న పట్నాలతో వైభవంగా పండుగ నిర్వహిస్తారు. ఇప్పుడు అధికారులు హద్దులు నిర్ణయించిన రివర్ బెడ్‌లోనే ఈ గుడి ఉండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూసీకి ఎంత పెద్ద మొత్తంలో వరద వచ్చినా గుడి మునగదని, ఏండ్ల తరబడిగా దేవుడిని ఆరాధించడం ఆచారంగా వస్తుందని చెబుతున్నారు. నది నుంచి పది మీటర్ల కంటే ఎత్తులో ఉండటంతో 2020, 2025 వరదల సమయంలోనూ వరద గుడిని తాకలేదని అంటున్నారు. తరతరాలుగా తమ తాతల కాలం నుంచి పూజిస్తున్న మల్లన్నస్వామి గుడిని తొలగిస్తే సహించమని గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. అదే విధంగా అధికారులు మార్కింగ్ చేసిన బఫర్ జోన్లో కిస్మత్పూర్ గ్రామ క్రైస్తవ శ్మశానవాటిక, హిందూ శ్మశాన వాటికలు ఉన్నాయి. శ్మశాన వాటికలను తొలగిస్తే సమానమైన భూమిని ఇవ్వాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
అధికారులు మాత్రం వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మిట్టమధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో రివర్ బెడ్, బఫర్‌జోన్లకు మార్కింగ్‌లు చేస్తూ ఎమ్‌ఆర్‌డీసీఎల్ పేరిట స్తంభాలు నాటుతున్నారు. అదే విధంగా ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో కూడా కొంత భాగం బఫర్‌జోన్‌లో ఉన్నట్లు గుర్తించారు. పెట్రోల్ బంక్ నిర్వాహకులు మాత్రం స్థలాన్ని హెచ్ఎండీఏ వేలంలో కొనుగోలు చేశామని చెబుతున్నారు. ప్రభుత్వమే వేలం ద్వారా విక్రయించి, అన్ని అనుమతులిచ్చి ఇప్పుడు బఫర్‌జోన్‌లో ఉన్నట్లు సూచికలు పెట్టి వెళ్తున్నట్లు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.