న్యూఢిల్లీ: తమ మాట వినని దేశాలను సుంకాల పేరుతో తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపి 25 శాతం అదనంగా సుంకం (Trump Trariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్‌పై అమెరికా విధించిన మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది. అదనంగా విధించిన 25 శాతం సుంకం 21 రోజుల తర్వాత అంటే ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతకుముందు జూలై 31న ప్రకటించిన 25 శాతం సుంకాలు గురువారం (ఆగస్టు 7) ఉదయం 9.30 గంటల నుంచి (భారతీయ కాలమానం ప్రకారం) అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో సేంద్రీయ రసాయనాలు, కార్పెట్లు, బట్టలు, నేసిన వస్త్రాలు, టెక్స్టైల్స్, మేడ్ అప్లు, వజ్రాలు, బంగారు వంటి ఉత్పత్తులపై భారీగా పడనుంది. అత్యధికంగా భారతీయ బట్టల ఎగుమతులపై 63.9 శాతం సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. కాగా, ప్రస్తుతానికి ఔషధాలు, స్మార్ట్ఫోన్లపై ఎలాంటి సుంకాలు విధించలేదు. పెట్రోలియ ఉత్పత్తులపై 6.9 శాతం మాత్రమే సుంకాలు విధించారు.
ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు (క్రూడాయిల్, రిఫైన్డ్ ఇంధనం, సహజ వాయువు, బొగ్గు, విద్యుత్తు, కీలక ఖనిజాలు, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు, డ్రైవ్‌లు, ప్యానల్ బోర్డులు, సర్క్యూట్లపై ట్రంప్ ఎలాంటి సుంకాలు విధించలేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌పై సుంకాల మోత మోగిస్తున్నారు. చైనా, కెనడా కంటే అధికంగా భారత్‌పై టారిఫ్‌లు విధించారు. అమెరికా అత్యధికంగా విధించిన సుంకాల జాబితాలో బ్రెజిల్‌తో కలిసి భారత్ సంయుక్తంగా మొదటిస్థానంలో ఉన్నది. ఇరు దేశాలపై ట్రంప్ 50 శాతం టారిఫ్ విధించారు. ఆ తర్వాత స్థానాల్లో స్విట్జర్లాండ్(39 శాతం), కెనడా, ఇరాక్ (35 శాతం చొప్పున), చైనా (30 శాతం) నిలిచాయి.
కాగా, ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు 69 దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం నుంచి 41 శాతం వరకు ప్రతీకార సుంకాలను విధించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 7 నుంచి అమలులోకి వస్తాయి. మెక్సికోతో గతంలో కుదుర్చుకున్న 90 రోజుల ఒప్పందం ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ ఆర్డర్ జారీ అయింది. దీని ప్రకారం ఆగస్టు 7 నుంచి మెక్సికోపై అదనపు సుంకాలు అమలులోకి వస్తాయి.