హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో విద్యుత్తు (సవరణ) బిల్లు-2025ను ప్రవేశపెడితే మెరుపు సమ్మె కు వెనుకాడబోమని తెలంగాణ స్టేట్ పపర్ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరించింది. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీవోఈఈఈ) కమిటీ పిలుపు మేరకు మంగళవారం భోజన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఖైరతాబాద్ విద్యుత్తుసౌధలో పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతులు, వినియోగదారులు, ఉద్యోగ వ్యతిరేకమైన ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జేఏసీ నేతలు ఈ శ్రీధర్, పీ సదానందం, వెంకటేశ్వర్లు డిమాం డ్ చేశారు. ఈ బిల్లు ద్వారా ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ విద్యుత్తు పంపిణీ సంస్థల నెట్వర్క్ను ఉపయోగించుకొనే హక్కు కల్పించారని మండిపడ్డారు. నిరసనలో జేఏసీ నేతలు శివశంకర్, సురేశ్, వెంకటేశ్, శ్రీనివాస్, కిషోర్, కిరణ్, విద్యాసాగర్, హరికృష్ణ, సత్యనారాయణరాజు పాల్గొన్నారు.