Donald Trump : రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) దేశాల మధ్య 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలు అందిస్తూనే ఉంది. అయితే ఇటీవల తమ ఆయుధ నిల్వలను సమీక్షించిన అమెరికా.. ఉక్రెయిన్‌కు కొన్నిరకాల ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని పెంటగాన్ అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ హయాంలో దేశం గురించి ఆలోచించకుండా ఉక్రెయిన్‌కు విపరీతంగా ఆయుధాలు అందజేశారని, దేశాన్ని ఖాళీ చేశారని ఆరోపించారు. దేశ భద్రతకు సరిపడా ఆయుధాలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని.. అందుకే కీవ్‌కు అందజేయాల్సిన ఆయుధ సామాగ్రిపై కోత విధించినట్లు ఆయన పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదట్లో ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం అంగీకరించిందని, అయితే ఇటీవల ఆయుధ నిల్వలను సమీక్షించిన రక్షణశాఖ.. కీవ్‌కు ఇస్తామని హామీ ఇచ్చిన ఆయుధాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించిందని ట్రంప్ తెలిపారు. ఆయుధ కొరత కారణంగా ఉక్రెయిన్‌కు పంపాల్సిన పెండింగ్ షిప్మెంట్లను పంపించొద్దని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
కాగా బైడెన్ హయాంలో అమెరికా ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ, సైనిక సహాయాన్ని అందించింది. ఆయన పదవి నుంచి వైదొలగడానికి ముందు కూడా ఉక్రెయిన్‌కు పెద్ద మొత్తంలో ఆర్థిక, ఆయుధ సాయం చేస్తామని ప్రకటించారు. రష్యా భూభాగంలో దాడులకు వీలుగా దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి కూడా అమెరికా నుంచి కీవ్‌కు అనుమతులు లభించాయి. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా కీవ్‌కు ఆయుధ సాయాన్ని కొనసాగించారు. ఇప్పుడు నిలువలు తగ్గడంతో సరఫరాను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.