Reward : అగ్రరాజ్యం అమెరికా (USA) లో డ్రగ్స్ వ్యాప్తిని, హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గత కొన్నేళ్లుగా వెనెజులా అధ్యక్షుడు (Venezuela president) నికోలస్ మడురో (Nicolas Maduro) పై అగ్రరాజ్యం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో మడురోను అరెస్టు చేయాలని చూస్తోంది. అందుకే మడురో అరెస్టుకు సహకరిస్తే ఏకంగా 50 మిలియన్ డాలర్లు (రూ.430 కోట్లు) ముట్టజెబుతామంటూ సంచలన ప్రకటన చేసింది.
డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు ఈ రికార్డు 15 మిలియన్ డాలర్లుగా ఉంది. జో బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక దాన్ని 25 మిలియన్ డాలర్లకు పెంచారు. తాజాగా ఆ మొత్తాన్ని 50 మిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ ఎక్స్‌లో ఒక వీడియో పోస్టు చేశారు. అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తికి, హింసను ప్రేరేపించేందుకు నికోలస్ మడురో.. ట్రెన్ డె అరాగువా, సినలో, కార్టల్ ఆఫ్ ది సన్స్ వంటి వాటిని వినియోగిస్తున్నారని పామ్ బాండీ ఆరోపించారు.
ఇప్పటివరకు నికోలస్ మడురోకు సంబంధించిన 7 టన్నుల కొకైన్‌తోపాటు ఆయన సన్నిహితులకు సంబంధించిన 23 టన్నుల కొకైన్‌ను డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసిందని బాండీ చెప్పారు. వెనెజులా, మెక్సికోలలోని డ్రగ్ మాఫియాకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్నారు. ఫెంటెనిల్ స్మగ్లింగ్‌తో కూడా మడురోకు సంబంధాలున్నాయని బాండీ పేర్కొన్నారు. 2020 మార్చిలో ఆయనపై దక్షిణ న్యూయార్క్ డిస్ట్రిక్ట్‌లో కేసులు నమోదైనట్లు చెప్పారు.
కాగా మడురోకు సంబంధించిన ప్రైవేట్ జెట్లు, తొమ్మిది వాహనాలు సహా 700 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సీజ్ చేసింది.