న్యూఢిల్లీ: అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో ఎస్యూ-30 ఎంకేఐ యుద్ధ విమానం కూలిపోయిన ప్రమాదంలో భారతీయ వైమానిక దళానికి(ఏఐఎఫ్) చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు. రష్యన్ తయారీ సుఖోయ్ యుద్ధ విమానం అదృశ్యమైన మరుసటి రోజున స్కాడ్రన్ లీడర్ అనూజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురగ్కర్ మరణాలను ఐఏఎఫ్ శుక్రవారం ధ్రువీకరించింది. గురువారం అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రాత్రి 7.42 గంటలకు విమానంతో కమ్యూనికేషన్ నిలిచిపోయిందని అధికారులు చెప్పారు. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు ఐఏఎఫ్ పేర్కొన్నది.
సుఖోయ్ యుద్ధ విమాన ప్రమాదంలో మరణించిన తన కుమారుడు ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురగ్కర్ 10 రోజుల క్రితమే ఓ కుటుంబ వేడుకలో పాల్గొన్నట్లు ఆయన తండ్రి రవీంద్ర తెలిపారు. బుధవారం తన కుమారుడితో జరిగిన ఫోన్ సంభాషణలను రవీంద్ర గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్లో తన 28 ఏండ్ల కుమారుడు పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తుకు చేసుకొన్నారు.