బెంగుళూరు: కర్నాటక క్యాబినెట్ నుంచి మంత్రి బీ నాగేంద్రను తొలగించాలని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఆ డిమాండ్‌ను కర్నాటక సీఎం డీకే శివకుమార్(CM DK Shivakumar) తిరస్కరించారు. రాజకీయ మనుగడ కోసం బీజేపీ, జేడీఎస్ పార్టీలు డ్రామా ఆడుతున్నాయని సీఎం ఆరోపించారు. నాగేంద్రను మళ్లీ క్యాబినెట్లోకి తీసుకోవడాన్ని సీఎం డీకే సమర్ధించుకున్నారు. మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో ఆయన పాత్ర లేదని సీఎం చెప్పారు. మంత్రి నాగేంద్రను ఎందుకు తొలగించాలో నోటీసు ఇచ్చి, దానిపై చర్చ చేపట్టాలని సీఎం అన్నారు.
ఎటువంటి ఆధారాలు లేకుండానే ఎస్టీ మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించాలని చూస్తున్నట్లు సీఎం ఆరోపించారు. కేంద్రంలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ మంత్రులపైన కేసులు లేవా, మంత్రి నాగేంద్రపై ఉన్న కేసును వెరిఫై చేశామని, ఈడీ కేసులో ఆయన పాత్ర ఏమీ లేదని, వాల్మీకి కార్పొరేషన్ నుంచి 84 కోట్లు మాయం అయితే, దాంట్లో 79 కోట్లను రికవరీ చేశామని, కానీ నాగేంద్ర వద్ద ఏమీ దొరకలేదని సీఎం డీకే తెలిపారు.
సీఎం సిద్ధరామయ్య కేబినెట్లో నాగేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కర్నాటక మహర్షి వాల్మీకీ ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవకతవకలు జరిగాయి. అయితే నాగేంద్ర రాజీనామా చేశారు. కానీ మళ్లీ ఆగస్టు 3వ తేదీన డీకే శివకుమార్ తన క్యాబినెట్లో నాగేంద్రను చేర్చుకున్నారు. 2024 జూలైలో వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ కేసులో బల్లారి ఎమ్మెల్యే నాగేంద్రను ఈడీ అరెస్టు చేసింది. ఆ ఏడాది అక్టోబర్‌లో బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈడీ, సీబీఐ ఛార్జ్‌షీట్‌లో మంత్రి నాగేంద్ర పేరు ఉన్నది.