Tariffs | టారిఫ్‌ల విషయంలో అమెరికా-చైనా ఢీ అంటే ఢీ అంటున్నాయి. అమెరికా దిగుమతుల్లో చైనా వాటా 13.4 శాతంగా ఉన్నది. బుధవారం నుంచి అమల్లోకి వచ్చే అదనపు టారిఫ్‌ల్లో చైనాపై ట్రంప్ 34 శాతం విధించారు. దీనికి దీటుగా చైనా కూడా తమ దేశంలోకి వచ్చే అమెరికా వస్తూత్పత్తులపై గురువారం నుంచి మరో 34 శాతం సుంకాలుంటాయని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో తన హెచ్చరికలను బేఖాతరు చేసిన బీజింగ్‌పై ట్రంప్ ఏకంగా 104 శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై చైనా తీవ్రంగా స్పందించింది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఈ విషయంలో చివరి వరకూ పోరాడతామని పేర్కొంది.
మంగళవారం యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డిర్ లేయన్తో జరిగిన ఫోన్ కాల్ సందర్భంగా చైనా ప్రీమియర్ లీ కియాంగ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాల పేరుతో అమెరికా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందన్నారు. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా తమ ఆర్థిక విధానాలను రూపొందించినట్లు చెప్పారు. తమ దేశంపై అధిక సుంకాలు విధిస్తున్న అమెరికాకు తగిన విధంగా బదులిచ్చేందుకు తమ వద్ద విధానపరంగా అన్ని ఆయుధాలు ఉన్నాయని వెల్లడించారు. అమెరికా వాణిజ్య భాగస్వాములపై ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.. ఏకపక్షవాదం, రక్షణవాదం, ఆర్థికపరంగా బలవంతపు చర్యలకు ఉదాహరణగా అభివర్ణించారు. దీనికి తమ నుంచి తప్పకుండా ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
Also Read..
వార్ వన్‌సైడ్ కాదు.. మరింత ముదురుతున్న వాణిజ్య యుద్ధం
Asian Share Market | యూఎస్-చైనా టారిఫ్ వార్.. నష్టాల్లోకి జారుకున్న ఆసియా మార్కెట్లు..!
US-China Tariff War | ట్రంప్ అన్నంత పని చేశాడుగా..! చైనాపై 104 శాతం ప్రతీకార సుంకాలు..!