ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు హాట్ టాపిక్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలే.
అయితే ట్రంప్ అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటిలా తయారైంది పరిస్థితి. అగ్రరాజ్యం అధినేతకు చైనా ఎంతకీ మింగుడుపడటం లేదుమరి.
అమెరికా ప్రతీకార సుంకాలకు ప్రపంచ దేశాలు ఆలోచనలకే పరిమితమైతే.. డ్రాగన్ మాత్రం దీటుగా స్పందించింది. తామూ సుంకాలు వేస్తామని తేల్చిచెప్పింది. దీంతో వెనుకకు తగ్గకపోతే మరో 50 శాతం సుంకాలు తప్పవని ట్రంప్ హెచ్చరించినా తగ్గేదేలే అంటున్నది చైనా.
బీజింగ్/వాషింగ్టన్, ఏప్రిల్ 8 : వాణిజ్య యుద్ధం ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికాతో చైనా ఢీ అంటే ఢీ అంటుండటంతో వార్ వన్‌సైడ్ కాదని స్పష్టమైపోతున్నది మరి. అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలపై డ్రాగన్ కూడా అంతే దూకుడుతో వ్యవహరిస్తున్నది. అమెరికా దిగుమతుల్లో చైనా వాటా 13.4 శాతంగా ఉన్నది. బుధవారం నుంచి అమల్లోకి వచ్చే అదనపు టారిఫ్‌ల్లో చైనాపై ట్రంప్ 34 శాతం విధించారు. దీనికి దీటుగా చైనా కూడా తమ దేశంలోకి వచ్చే అమెరికా వస్తూత్పత్తులపై గురువారం నుంచి మరో 34 శాతం సుంకాలుంటాయని తేల్చిచెప్పింది. అయితే ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకపోతే అదనంగా మరో 50 శాతం సుంకాలు తప్పవని ట్రంప్ సోమవారం తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో హెచ్చరించారు. ఇదే జరిగితే ఇప్పటికే పడుతున్న 20 శాతం సుంకాలతో చైనా వస్తూత్పత్తులపై అమెరికాలో సుంకాల భారం మొత్తంగా 104 శాతానికి చేరుతుంది. మరోవైపు ట్రంప్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని చైనా దుయ్యబట్టింది. అంతేగాక ఈ విషయంలో ఎంతదాకైనా వెళ్తామని మంగళవారం కుండబద్దలు కొట్టింది.
ఈ ట్రేడ్ వార్‌లో చివరిదాకా పోరాడేందుకు సిద్ధమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జైన్ స్పష్టం చేశారు. ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సైతం అమెరికా బ్లాక్మెయిల్ సంస్కృతికి చైనా ఎప్పటికీ తలొగ్గబోదన్నారు. ఈ విషయంలో ఎంతదాకైనా వెళ్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ తప్పు మీద తప్పు చేస్తున్నారని హెచ్చరించారు. నిజానికి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన వెంటనే చైనాపై ట్రంప్ 20 శాతం అదనపు సుంకాలు వేశారు. కాగా, ప్రతీకార సుంకాలు చైనా ప్రొడక్ట్స్ ధరలను అమెరికా మార్కెట్లలో విపరీతంగా పెంచనున్నాయి. దీనివల్ల చైనాకు భారీగా నష్టమే. ఇక ఇప్పటికే చైనా మందగమనాన్ని ఎదుర్కొంటున్నది. ఈ టారిఫ్ వార్తో చైనా ఆర్థిక వృద్ధిరేటు 2 నుంచి 2.5 శాతం తగ్గవచ్చన్న అంచనాలున్నాయి.
అమెరికాతో చైనా వాణిజ్య యుద్ధం హాలీవుడ్ సినీ పరిశ్రమనూ తాకింది. చైనాలో విడుదలయ్యే హాలీవుడ్ సినిమాలపై నిషేధం విధించాలని డ్రాగన్ యోచిస్తున్నది. ట్రంప్ తాజా సుంకాల బెదిరింపు నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు ఇదే గనుక జరిగితే హాలీవుడ్ పరిశ్రమకు భారీగా ఆదాయం తగ్గిపోనున్నది.
టారిఫ్‌ల విషయంలో వెనుకకు తగ్గాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసినట్టు వార్తలొస్తున్నాయి. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలుంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
కొత్త టారిఫ్ విధానంతో అమెరికాకు మాంద్యం ముప్పు పొంచి ఉన్నదని ఆ దేశ ఆర్థిక సేవల దిగ్గజం జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డైమన్ హెచ్చరించారు. ట్రంప్ దూకుడు ప్రపంచాన్ని వాణిజ్య యుద్ధం వైపునకు ఎగదోస్తున్నదని ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు.
టారిఫ్ వార్ నేపథ్యంలో అమెరికాతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల్ని భారత్ వేగవంతం చేస్తున్నది. ఈ క్రమంలోనే ఈ అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో ఫోన్లో సంభాషించుకున్నారు.
అమెరికాకు జాగ్వార్ అండ్ లాండ్రోవర్ (జేఎల్ఆర్) కార్ల ఎగుమతుల్ని టాటా గ్రూప్ తాత్కాలికంగా ఆపేసింది. అమెరికాలోకి వచ్చే కార్లపై 25 శాతానికి పెరిగిన దిగుమతి సుంకాల నేపథ్యంలో ఒక నెల విరామం ఇచ్చినట్టు కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, వాచీలు తదితర మరికొన్ని లగ్జరీ ఉత్పత్తుల ఎగుమతులూ అమెరికాకు నిలిచిపోతున్నాయి.
వాణిజ్య యుద్ధం సెగ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలపైనా పడుతున్నది. బ్యారెల్ ముడి చమురు రేటు 50 డాలర్లకు దిగజారింది. దీంతో చమురు, ఇంధన, ఖనిజాల ఎగుమతులపైనే ఆధారపడ్డ రష్యా.. అమెరికాపై మండిపడుతున్నది. రష్యా అధ్యక్షుడు ఈ సంక్షోభం నివారణపై దృష్టి సారించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. నిజానికి ఇటీవలి టారిఫ్‌ల్లో రష్యాను అమెరికా మినహాయించింది. అయినప్పటికీ ట్రేడ్ వార్ ప్రభావం పరోక్షంగా రష్యాకు తాకుతున్నది. దీంతో రష్యా ఏ రకంగా ముందుకెళ్తుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నది.