ప్రజలను రక్షించాల్సిన రక్షక భటులు జనం మీదపడి ‘వడ్డీ’ని భక్షిస్తున్నారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సిన ఖాకీల్లోని కొందరు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఖాకీ చొక్కాను అడ్డంపెట్టుకొని వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న తోటి సిబ్బందితోపాటు చిరువ్యాపారులను టార్గెట్‌గా చేసుకొని వారి ప్రతాపం చూపుతున్నారు. నెల చిట్టీలు, రోజువారీ గిరిగిరి చిట్టీలు నడుపుతూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. అసలు చెల్లించడం ఆలస్యమైతే బెదిరించో.. దాడి చేసో అధిక మిత్తీ వసూలు చేస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకూ ఈ దందా శ్రుతిమించుతున్నది.
– సుబేదారి, మార్చి 1
వరంగల్ పోలీస్ కమిషననరేట్ పరిధిలో యూనిఫాంను అడ్డుంపెట్టుకొని కొందరు పోలీసులు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న తోటి సిబ్బందితో నెల వారీ చిట్టీలు, బయట మార్కెట్లో చిరు వ్యాపారులను టార్గెట్‌గా చేసుకొని గిరిగిరి చిట్టీలు నడుపుతూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా కమిషనరేట్ పరిధి ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఈ దందాకు తెగబడుతున్నారు. తనిఖీల విభాగంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఏకంగా రూ.5 నుంచి రూ.10 చొప్పున వడ్డీకి అప్పులిస్తూ అడ్డగోలుగా సంపాదిస్తున్నాడు. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న మరో ముగ్గురు సైతం ఇదే అనుసరిస్తున్నారు.
మరి కొందరు నెల వారీ చిట్టీలు నిర్వహిస్తున్నారు. లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్న కొంత మంది సిబ్బంది కూడా నెల చిట్టీలు, గిరిగిరి నిర్వహిస్తున్నారు. వారికి కొందరు ఉన్నతాధికారుల సపోర్ట్ కూడా ఉన్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం వడ్డీ వ్యాపారం చేస్తున్న కానిస్టేబుల్, అతను పనిచేసే వింగ్లోనే మరో కానిస్టేబుల్‌కు రూ.లక్ష అప్పు ఇచ్చి నెలకే అధిక వడ్డీ ఇవ్వాలనడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. చివరికి అప్పు తీసుకున్న కానిస్టేబుల్ అధిక వడ్డీ చెల్లించి అప్పు క్లియర్ చేశాడు. నలుగురు కానిస్టేబుళ్లు చాలాకాలం నుంచి వరంగల్ నగరంలో కూరగాయలు, హోటల్స్, కిరాణా షాపులు, మొబైల్ టిఫిన్ సెంటర్లు, పాన్‌షాప్ యజమానులకు రోజువారీగా గిరిగిరి ఇస్తూ అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు.

వడ్డీల దందాను ఆపేదెవరు..?
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు పోలీసులు చేస్తున్న వడ్డీ వ్యాపారాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారని ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బందే అంటున్నారు. కొందరు చాలాకాలంగా చిట్టీలు, అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ అక్రమంగా సంపాదిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గడవులోపు చెల్లించకుంటే దాడులు, బెదిరింపులు
వడ్డీ వ్యాపారం చేస్తున్న పోలీసులు అప్పులు తీసుకున్న వ్యక్తులపై దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారు ఇవ్వమన్న గడువులోగా అప్పు, వడ్డీ చెల్లించకుంటే దౌర్జన్యం చేస్తున్నారు. ‘ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో నేనే పోలీస్ నన్నెవరూ ఏమీ చేయలేరు’ అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. చిరువ్యాపారులకు వచ్చే రోజువారీ గిరిగిరి చిట్టీ డబ్బులను బెదిరించి వసూలు చేస్తున్నారు. అప్పులు తీసుకున్న వారు ఒకటి రెండు రోజులు చెల్లించకుంటే అడ్డగోలుగా బూతులు తిట్టి మిత్తికి మిత్తి తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం గోకుల్ నగర్లో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి అప్పు డబ్బుల విషయంలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడగా, బాధితుడు సుబేదారి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ కానిస్టేబుల్ యాదగిరిపై కేసు నమోదైంది.