ఎల్లారెడ్డి, మార్చి 1: రైతు సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో అంతులేని నిర్లక్ష్యం వహిస్తున్నది. పంటలు పండించిన రైతులు వాటిని అమ్ముకున్నా వాటి డబ్బుల కోసం నెలల తరబడి ఎదురుచూపులు తప్పడంలేదు. గిట్టుబాటు ధర కోసం నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. మక్కజొన్నల పైసల కోసం పైరవీలు తప్పడం లేదని రైతులు మండిపడుతున్నారు.
ఎరువులు కొనుగోలు చేద్దామంటూ యాప్ తిప్పలు తప్పడంలేదు. రైతు భరోసా వస్తుందన్న భరోసా లేకుండా పోయింది. ప్రజా పాలన పేరుకు మాత్రమేనని, రైతుల కష్టాలు, ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మక్కజొన్న పంటను కొనుగోలు చేసినప్పుడు వెంటనే డబ్బులు వస్తాయని అధికారులు నమ్మబలికారని, ఇప్పుడు కనీసం ఫోన్‌చేస్తే సమాధానం సైతం చెప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ గోస ఎవరికి చెప్పుకోవాలని రైతులు వాపోతున్నారు.
జిల్లాకు రావాల్సింది రూ. 63 కోట్లు
మార్క్‌ఫెడ్‌కు మక్కజొన్న పంటను విక్రయించిన జిల్లాలోని 5,750 మంది రైతులకు రూ.63 కోట్ల 20 లక్షలు రావాల్సి ఉంది. డిసెంబర్ నెలలో రైతుల నుంచి ఆయా మండలాల్లోని సహకార పరపతి సంఘాల ద్వారా మార్క్‌ఫెడ్ అధికారులు మక్కజొన్న పంటను కొనుగోలు చేశారు. జిల్లాలో 9,490 మంది రైతుల నుంచి 4లక్షల 22 వేల 198 క్వింటాళ్ల మక్కజొన్న పంటను కొనుగోలు చేసిన అధికారులు.. 3,733 మంది రైతులకు మాత్రమే డబ్బులు చెల్లించారు. మిగతా రైతులకు డబ్బులు చెల్లించక పోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉండే సొసైటీ అధికారులను అడిగితే తమకు సంబంధం లేదని, మార్క్‌ఫెడ్ అధికారులను అడగాలని వారు సమాధానమిస్తున్నారు. మార్క్‌ఫెడ్ అధికారులకు ఫోన్ చేస్తే వారు స్పందించడంలేదని రైతులు వాపోతున్నారు.
మంత్రికి విన్నవించినా ఫలితం శూన్యం
వారం రోజుల క్రితం జిల్లాకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మక్కజొన్న రైతులు తమ డబ్బులు ఇప్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. జిల్లాలోని మాచారెడ్డి మండలంలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా లింగంపేట మండలంలోని మోతె, గాంధారి మండలానికి చెందిన కొందరు రైతులు కలిసి మంత్రికి తమ సమస్యను విన్నవించారు. మంత్రిగారికి వినతి పత్రం సమర్పించినా తమ డబ్బులు మాత్రం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు
మా గ్రామంలోనే 145 మంది రైతులున్నరు..
మక్క జొన్న పంటను తూకం వేసి రెండు నెలలు దాటింది. డిసెంబర్ నెలలో సొసైటీ ద్వారా మార్క్‌ఫెడ్ అధికారులకు మక్కలు ఇచ్చాం. రెండు నెలలు దాటి మూడు నెలలు వచ్చినా పైసలు రాలేదు. ఎప్పుడు వస్తాయనే విషయం అధికారులు చెప్పడం లేదు. మా గ్రామంలోనే 20 వేల బస్తాల వరకు అమ్మినం. మార్క్‌ఫెడ్ అధికారులు కనీసం మా ఫోన్‌ను లేపడం లేదు. సమాధానం చెప్పడం లేదు.
-రాజేశ్వర్ రావు, రైతు, మోతె, లింగంపేట మండలం
పైసల కోసం అడిగితే ఏం చెప్పడం లేదు
మక్కలు జోకి చాలా రోజులైంది. పైసలు ఎప్పుడిస్తరని సొసైటీల్లో అడిగితే ఏం చెబుతలేరు. ఇప్పుడు యాసంగి కోసం అప్పులు చేస్తు న్నం. ఆనకాలం పంట అమ్ముకుంటే ఇంకా పైసలు రా లేదు. ఏసిన పంటకు మందులు దొరుకుత లే వు. పంట తీసుకున్న సార్లు పైస లు ఇస్త లేరు, ఇందిరమ్మ రాజ్యం అన్నరు. ఇట్ల గోస పెడ్తున్నరు.
-గడ్డం సంగవ్వ, రైతు, మోతె, లింగంపేట మండలం