హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ) : తాము జారీచేసిన టెండర్లల్లో ఎలాంటి మార్పులు చేయలేదని టీజీ ట్రాన్స్కో స్పష్టంచేసింది. కొత్తగా జారీచేసే టెండర్ల అంచనా వ్యయాన్ని ప్రభుత్వం ఆమోదించిన స్టాండర్డ్ షె డ్యూల్ ఆఫ్ రేట్స్ ఆధారంగానే నిర్ణయిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.
ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ‘టెండర్ల అంచనాలు పెంచండి’ శీర్షికన ప్రచురి తమైన కథనంపై టీజీ ట్రాన్స్కో లిఖిత పూర్వక వివరణ ఇచ్చింది. ఎనర్జీ స మ్మిట్లకు స్పాన్సర్ చేయడం, విద్యుత్తు సంస్థల ఉద్యోగులను ప్రతినిధులుగా పంపడం సర్వసాధారణమేనని తెలిపింది. వడ్డీ రేటును తగ్గించుకునేందుకే రుణాల మార్పిడి(లోన్ స్వాపింగ్) చర్యలు చేపట్టామని పేర్కొన్నది.
జన్నారం, ఆగస్టు 4 : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి అటవీ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో ఐదుగురు గిరిజన యువకులపై అటవీ అధికారులు దౌర్జన్యం చేయడంతో మూడు రోజులుగా ఆదివాసీ, గిరిజన నాయకులు ఆందోళనలు చేశారు. ఐటీడీఏ పీవో 24 గంటల్లో సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం, గిరిజన యువకులను తిరిగి అప్పగించడంతో ఆందోళన విరమించారు. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఆదివాసులపై దాడి చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్కార్ స్పందించకుంటే ఆదివాసీలతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఇందన్పల్లి ఎఫ్ఆర్వో లక్ష్మీనారాయణను స స్పెండ్ చేస్తూ కాళేశ్వరం సర్కిల్ సీసీఎఫ్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.