కోల్‌కతా : భారత క్రికెట్ అభిమానుల ఉత్కంఠకు తెర! టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాట్‌తో అదరగొట్టింది. బంతితో అంచనాలను అందుకోలేకపోయినా బ్యాట్‌తో మాత్రం సత్తాచాటింది. భారత క్రికెట్ మక్కాగా పిలుచుకునే ఈడెన్ గార్డెన్స్‌లో వర్చువల్ నాకౌట్‌గా సాగిన పోరులో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుచేసి సెమీస్‌కు అర్హత సాధించింది. విండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ ఛేదనలో వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (50 బంతుల్లో 97 నాటౌట్, 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) తన కెరీర్లోనే అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడి మెరుపులతో ఛేదనను సూర్య సేన..19.2 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. శాంసన్‌కే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అంతకుముందు భారత ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ సమష్టిగా ఆడి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40, 5 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోవ్‌మన్ పావెల్ (19 బంతుల్లో 34 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (32) రాణించారు. ఈ ఓటమితో విండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఛేదనలో అభిషేక్ (10) మరోసారి స్పిన్ ఉచ్చులో చిక్కుకుని నిరాశపరచగా హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన ఇషాన్ కిషన్ (10) సైతం అతడినే అనుసరించాడు. ఈ క్రమంలో సంజూ, కెప్టెన్ సూర్య (18) జట్టును ఆదుకున్నారు. అకీల్ రెండో ఓవర్లో ఫోర్, రెండు సిక్స్‌లతో పరుగుల వేట ఆరంభించిన శాంసన్.. తన కెరీర్ ఊగిసలాటల నడుమ మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. అనవసర షాట్లు ఆడి వికెట్ సమర్పించుకునే అలవాటున్న అతడు.. ఈ మ్యాచ్‌లో అలాంటి తప్పిదాలకు చోటివ్వకుండా ఇన్నింగ్స్ ఆసాంతరం బాధ్యతతో ఆడాడు. షెఫర్డ్ ఓవర్లో లాంగాన్ మీదుగా 6, 4 బాదిన అతడు.. బౌండరీతో 26 బంతుల్లోనే తన తొలి టీ20 వరల్డ్ కప్ అర్ధ శతకం నమోదుచేశాడు. 11వ ఓవర్లో బంతినందుకున్న జోసెఫ్.. సూర్యను ఔట్ చేసి 58 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. 10-12 ఓవర్ల మధ్య స్కోరు వేగం నెమ్మదించడంతో పాటు ఛేదించాల్సిన రన్‌రేట్ పెరుగుతుండటంతో సంజూ, సూర్య స్థానంలో వచ్చిన తిలక్ గేర్ మార్చారు. జోసెఫ్ ఓవర్లో తిలక్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. ధాటిగా ఆడే క్రమంలో తిలక్.. డ్రింక్స్ విరామం తర్వాత హెట్మెయర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అప్పటికే క్రీజులో పాతుకుపోయిన సంజూ.. హార్ధిక్ పాండ్య (17), శివమ్ దూబె (8*) అండతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఆరంభంలో ఆచితూచి ఆడిన విండీస్ బ్యాటర్లు క్రీజులో కుదురుకున్నాక మెరుపులు మెరిపించి.. ఆఖర్లో తమ మార్కు విధ్వంసంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. స్టార్ పేసర్ బుమ్రా మినహా నాసిరకంగా కనిపించిన భారత బౌలింగ్, ఫీల్డింగ్ తప్పిదాలను ఆసరాగా చేసుకుని పక్కా ప్రణాళికతో భారీ స్కోరు సాధించారు. ఓపెనర్‌గా ప్రమోట్ అయిన రోస్టన్ ఛేజ్.. కెప్టెన్ షై హోప్‌తో కలిసి పవర్ ప్లేలో భారత బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. భారీ మెరుపులేమీ లేకపోయినా పవర్ ప్లేలో వికెట్లేమీ కోల్పోకుండా 45 రన్స్ చేసిన విండీస్.. 9వ ఓవర్లో తొలి వికెట్‌ను కోల్పోయింది. హోప్‌ను వరుణ్ బౌల్డ్ చేశాడు. బుమ్రా 12వ ఓవర్లో ప్రమాదకర హెట్మెయర్ (27)తో పాటు ఛేజ్నూ ఔట్ చేశాడు. హార్ధిక్ ఓవర్లో రూథర్‌ఫర్డ్ (14) కూడా నిష్క్రమించాడు. అతడు ఔటయ్యే సమయానికి విండీస్ స్కోరు 14.1 ఓవర్లకు 119/4గానే ఉంది. కానీ ఆఖరి ఐదు ఓవర్లలో కరీబియన్లు ఏకంగా 70 రన్స్ పిండుకున్నారు. హోల్డర్, పావెల్ అభేద్యమైన ఐదో వికెట్‌కు 35 బంతుల్లోనే 76 పరుగులు జోడించి భారత్ ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపారు.
భారత్, వెస్టిండీస్ మ్యాచ్‌తో ప్రపంచకప్‌లో సూపర్-8 దశకు శుభం కార్డు పడింది. గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా, భారత్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. గ్రూప్-2 నుంచి పాక్ నిష్క్రమించడంతో రెండు సెమీస్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ కూడా భారత్‌లోనే జరుగనుంది. మార్చి 4న సౌతాఫ్రికా.. కోల్‌కతా వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుండగా ఆ మరుసటి రోజున ఇంగ్లండ్.. ముంబైలో టీమ్ఇండియాతో అమీతుమీ తేల్చుకోనుం ది. సెమీస్‌లో గెలిచిన జట్లు ఈనెల 8న అహ్మదాబాద్‌లో టైటిల్ పోరులో తలపడతాయి.
వెస్టిండీస్: 20 ఓవర్లకు 195/4 (ఛేజ్ 40, హోల్డర్ 37*, బుమ్రా 2/36, వరుణ్ 1/40);
భారత్: 19.2 ఓవర్లకు 199/5 (శాంసన్ 97*, తిలక్ 27, హోల్డర్ 2/38, జోసెఫ్ 2/42)