ఢిల్లీ : పొట్టి ప్రపంచకప్‌లో సఫారీల జోరు కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న ఆ జట్టు.. సెమీస్‌కు ముందు సూపర్-8 దశనూ అజేయంగానే ముగించింది. గ్రూప్-1లో ఢిల్లీ వేదికగా జింబాబ్వేతో జరిగిన పోరులో ఆ జట్టును 5 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ప్రత్యర్థి నిర్దేశించిన 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సఫారీలు 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓపెనర్లు త్వరగానే నిష్క్రమించినా డెవాల్డ్ బ్రెవిస్ (18 బంతుల్లో 42, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికెల్టన్ (22 బంతుల్లో 31, 4 సిక్స్‌లు), జార్జ్ లిండె (21 బంతుల్లో 30 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. వీరి ధనాధన్ ఆటతో జింబాబ్వే సారథి ఆల్‌రౌండ్ మెరుపులు వృథా అయ్యాయి.
బంతితో దక్షిణాఫ్రికాను (3/29) కట్టడి చేసిన అతడు.. బ్యాట్ (43 బంతుల్లో 73, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)తోనూ అదరగొట్టాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రజా, ైక్లెవ్ మదాండె (26) ఆదుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 రన్స్ చేసింది. మఫాక (2/21), బాష్ (2/40) తలా రెండు వికెట్లు తీశారు. లీగ్ దశలో ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్టుకు షాకిచ్చి సూపర్-8 చేరిన జింబాబ్వే.. ఈ దశలో మాత్రం ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అంచనాలను అందుకోలేక చతికిలపడింది.