Bangladesh | బంగ్లాదేశ్ (Bangladesh) ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2026లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు స్టేట్ టెలివిజన్‌తో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు.
బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది జనవరిలో సార్వత్రిక ఎన్నికలు (Bangladesh Elections) జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. దీంతో బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె షేక్ హసీనా (Sheikh Hasina) సునాయాసంగా నాలుగోసారి ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకున్నారు. ప్రధాని షేక్ హసీనా ఎన్నికలను జరిపిన తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు కూడా వచ్చాయి. అయితే, హసీనా ప్రభుత్వం ఎన్నో రోజులు అధికారంలో నిలవలేదు.
రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె రాజీనామాతో బంగ్లాలో మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు ఉంటాయా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే యూనస్ కీలక ప్రకటన చేశారు. 2025 చివర్లో గానీ, 2026 ఆరంభంలో గానీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Also Read..
“Bangladesh | హిందువులపై దాడులు నిజమే.. అంగీకరించిన బంగ్లాదేశ్”
“షేక్ హసీనాను గద్దె దింపడం వెనక కుట్ర”
“బంగ్లా ప్రభుత్వాధినేతగా యూనస్ ప్రమాణం”