ఢాకా, ఆగస్టు 8: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్‌గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ప్రధాని పదవితో సమానమని అధికారులు ప్రకటించారు. అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి 16 మంది సభ్యులతో సలహా మండలిని ప్రకటించారు. ఇందులో విద్యార్థి ఉద్యమానికి నేతృత్వం వహించిన మహ్మద్ నహీద్ ఇస్లామ్, ఆసిఫ్ మహమ్మద్‌లకు కూడా స్థానం కల్పించారు. ప్రస్తుతం దేశంలో శాంతిని నెలకొల్పి పౌరులకు రక్షణ కల్పించడమే తమ తొలి ప్రాధాన్యమని 84 ఏండ్ల యూనస్ తెలిపారు.
అల్లర్లు, అస్థిరతతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో పరిస్థితులు సద్దుమణిగి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి చేరుకుంటారని ఆమె కుమారుడు సజీబ్ వాజీద్ జాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం చోటుచేసుకున్న హింసను మరింత రెచ్చగొట్టడానికి పాకిస్థాన్ నిఘా వ్యవస్థ ఐఎస్ఐ మరింత ఆజ్యం పోస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఆయన గురువారం పీటీఐతో మాట్లాడుతూ తన తల్లి హసీనా తప్పక బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తారని పేర్కొన్నారు. అయితే ఆమె రాజకీయాల నుంచి నిష్క్రమించిన నేతగా వస్తారో, క్రియాశీలక నేతగా వస్తారో ఇంకా నిర్ణయించలేదని అన్నారు.
షేక్ ముజీబ్ కుటుంబం ఎన్నడూ దేశ ప్రజలను వదిలి వెళ్లదని, ప్రస్తుత పరిస్థితులతో అవాక్కయి ఉన్న అవామీ లీగ్ పార్టీని అనాథలా వదిలేయరని ఆయన స్పష్టం చేశారు. బంగ్లాపై అంతర్జాతీయ సమాజ అభిప్రాయాన్ని సేకరించడమే కాక, బంగ్లాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు భారత ప్రధాని మోదీ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ మరో అఫ్ఘనిస్థాన్లా అరాచక దేశంగా మారకుండా చూడాలని మధ్యంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న మహమ్మద్ యూనస్‌ను కోరారు.