రాజాపేట, డిసెంబర్ 03 : రాజాపేట గురుకుల పాఠశాలలో జరిగిన గొడవ నేపథ్యంలో అధికారులు, పోలీసులు బుధవారం విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థుల మధ్యన మొదలైన గొడవ ఆ తర్వాత పదో తరగతి విద్యార్థి వద్దకు వెల్లిందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. గొడవ పడిన విద్యార్థులు క్షమాపణలు చెప్పారని, మరోమారు ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా పరీక్షలకు ప్రిపేర్ అవుతామని చెప్పినట్లు వెల్లడించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా క్రమశిక్షణ కమిటీ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస నాయుడు, ఇంటలిజెన్స్ సీఐ కృష్ణ ప్రసాద్, గురుకులాల రీజనల్ ఆఫీసర్ విద్యారాణి, రాజాపేట తాసీల్దార్ అనిత, యాదగిరిగుట్ట రూరల్ సీఐ మాదాసు శంకర్ గౌడ్, ప్రిన్సిపాల్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.