Rupee falls : అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ (Indian currency) రూపాయి (Rupee) విలువ మూడు రోజుల నుంచి వరుసగా పతనమవుతున్నది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే ఏకంగా 90 మార్క్‌ను దాటి సరికొత్త జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. క్రితం సెషన్లో 89.96 వద్ద ముగిసిన రూపాయి విలువ (Rupee Value).. నేటి ఆరంభం నుంచే క్షీణిస్తూ వచ్చింది.
ఒక దశలో ఏకంగా 90.29 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకింది. చివరగా బుధవారం నాటి ట్రేడింగ్ ముగిసే సమయానికి 90.19 వద్ద స్థిరపడింది. దిగుమతిదార్ల నుంచి డాలరుకు అధిక గిరాకీ, షార్ట్ కవరింగ్ కొనసాగడం లాంటివి రూపాయి క్షీణతకు కారణమయ్యాయి. భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై సందిగ్ధత, విదేశీ సంస్థాగత మదుపర్ల లాభాల స్వీకరణ వంటివి కూడా రూపాయి విలువను బలహీనపరుస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇదిలావుంటే ఇవాళ్టి నుంచి ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రారంభం కానుంది. డిసెంబర్ 5న వడ్డీ రేట్లపై కేంద్ర బ్యాంకు ప్రకటన చేయనుంది. కీలక వడ్డీరేట్లపై ఆర్బీఐ కోత పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.