Aleema Khan : పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని (Ex PM) ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan) సోదరి అయిన అలీమా ఖాన్ (Aleema Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pak Army Chief) ఆసిమ్ మునీర్ (Asim Munir) భారత్‌తో యుద్ధం కోరుకుంటున్నాడని, యుద్ధం కోసం తహతహలాడుతున్నాడని అన్నారు. తన సోదరుడు ఇమ్రాన్ మాత్రం పొరుగుదేశంతో స్నేహపూర్వక సంబంధాల కోసం ప్రయత్నాలు చేశాడని చెప్పారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీమా ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మునీర్‌ను ఇస్లామిక్ ఛాందసవాదిగా అభివర్ణించారు. ఇమ్రాన్ స్వేచ్ఛావాది అని చెప్పారు. ఈ సందర్భంగా మే నెలలో భారత్-పాక్ మధ్య యుద్ధానికిగల కారణం గురించి ప్రశ్నించగా.. ఆమె మునీర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సందర్భం వచ్చినప్పుడల్లా మునీర్ భారత్‌తో ఘర్షణలకు దిగుతాడని, ఇది భారత్‌తోపాటు దాని మిత్ర దేశాలకు కూడా నష్టమేనని అన్నారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతిచెందారని పెద్దఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన మరో సోదరి ఉజ్మా ఖానుమ్ ఇమ్రాన్‌ను మంగళవారం కలిశారు. సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇమ్రాన్ జైల్లో సురక్షితంగానే ఉన్నారని, అయితే ఆయనను మానసికంగా వేధిస్తున్నట్లు చెప్పారని ఆరోపించారు. తాను జైలు శిక్ష అనుభవించడానికి ఆసిమ్ మునీర్ కారణమని ఇమ్రాన్ తనతో చెప్పాడని తెలిపారు.