హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 21: దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించని సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ వరంగల్‌కు ఎందుకు వస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. రైతులకు మేలు చేయని సీఎం, మంత్రులు జిల్లాకు వచ్చే అర్హత లేదన్నారు. ఈ మేరకు శనివారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. ‘రెండేళ్లుగా దేవాదుల ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలే.. చుక నీరు ఇవ్వలే.. రెండేళ్లలో దేవాదుల పనులు పూర్తి చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి రైతులను మోసం చేశారు..’ అని పెద్ది ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల వైఫల్యం దేవాదుల ఆయకట్టు రైతులకు శాపంగా మారిందని పేర్కొన్నారు. రెండేళ్లలో ఒక్క పంపుహౌస్‌ను సరిగా నడుపలేదని విమర్శించారు. సర్కారు నిర్లక్ష్యంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు దేవాదుల నీళ్లు సరిగా అందడం లేదన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటనతో కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర లేచిందన్నారు. గోదావరి నదిలో నీళ్లున్నా సర్కారు నిర్లక్ష్యంతో రైతులకు సాగునీరు అందలేదన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో 90 శాతం పనులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేస్తే రెండున్నరేళ్లలో కాంగ్రెస్ సర్కారు ఒక శాతం కూడా చేయలేదన్నారు. పంట కాల్వలకు భూసేకరణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యమ నేత కేసీఆర్‌పై మొరగడానికే ముఖ్యమంత్రి, మంత్రులకు రెండేళ్లు సరిపోయిందని పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఓటమి భయంతో రేవంత్‌రెడ్డి ప్రాజెక్టుల పేరుతో వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.