అయిజ, ఫిబ్రవరి 21 : షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకొని పైపుల ఫ్యాక్టరీ దగ్ధమైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. అయిజలోని రాయిచూర్ రోడ్డు పక్కన పరమేశ్వర ఇండస్ట్రియల్ డ్రిప్ పైపుల ఫ్యాక్టరీలో శనివారం ఉదయం 9 గంటలకు షార్ట్ సర్క్యూట్‌తో నిప్పురవ్వలు అంటుకొన్నాయి. పెద్దఎత్తున మంటలు రాజుకోవడంతో ఫ్యాక్టరీ మొత్తం తగలబడింది. దీంతో నిల్వ ఉన్న 12 వేల బండిల్స్ డ్రిప్ పైపులు, 5 టన్నుల మొక్కజొన్న, ముడి సరుకు, మోటర్లు, ప్యానల్ బోర్డులు, ఇతర మెటీరియల్ మంటల్లో కాలిపోయాయి. 2 కి.మీ. దూరం వరకు పొగ కమ్ముకున్నది.
ఎస్సైలు శ్రీనివాసరావు, కిరణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ అధికారులకు సమాచారం అందించగా.. అగ్నిమాపక ఎస్సై రాకేశ్ ఆధ్వర్యంలో మంటలు ఆర్పేందుకు 4గంటలు శ్రమించారు. అప్పటికే మొత్తం బూడిదై, రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు భూంపురం ప్రతాప్‌రెడ్డి తెలిపాడు. మున్సిపల్ చైర్మన్ సీఎం సురేశ్, వైస్ చైర్మన్ నర్సింహులు మంటలను ఆర్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే విజయుడు ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని వివరాలను తెలుసుకొన్నారు. అయిజలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వంతో చర్చించి ఏర్పాటు చేసేలా చూస్తానన్నారు.