లక్నో: పానీపూరీ తినేందుకు ఒక మహిళ పెద్దగా నోరు తెరిచింది. దీంతో ఆమె దవడ జాయింట్ విరిగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ నోరు మూయలేకపోయింది. (Woman’s Jaw Dislocates) ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని ఔరైయా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దిబియాపూర్ ప్రాంతంలోని గౌరీ కిషన్పూర్ గ్రామానికి చెందిన 42 ఏళ్ల ఇంకాలా దేవి పని నిమిత్తం ఔరైయాకు వచ్చింది. కాన్సు కోసం బంధువైన మహిళ ఆసుపత్రితో చేరడంతో ఆ సమీపంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నది.
కాగా, నవంబర్ 29న ఇంకాలా దేవి తన బంధువులతో కలిసి పానీపూరీలు తింటున్నది. నేలపై కూర్చొన్న ఆమె పానీపూరీ తినేందుకు పెద్దగా నోరు తెరిచింది. అయితే ఆమె దవడ జాయింట్ విరిగిపోయింది. ఈ నేపథ్యంలో తెరిచిన నోరు మూయలేకపోయింది.
మరోవైపు గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇంకాలా దేవిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మనోజ్ కుమార్, శత్రుఘ్న సింగ్ ఆమె దవడను సరిచేసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో ప్రత్యేక చికిత్స కోసం చిచోలి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి ఇంకాలా దేవిని రిఫర్ చేశారు.
అయితే నోరు ఎక్కువగా తెరువడం వల్ల ఇంకాలా దేవి దవడ స్థానభ్రంశం చెందినట్లు డాక్టర్లు తెలిపారు. తినేటప్పుడు అనుకోకుండా అరుదుగా దవడ లాక్ ఓపెన్ కావడం వల్ల ఇలాంటి పరిస్థితి సంభవిస్తుందని చెప్పారు. ఇలాంటి కేసు తన దృష్టికి రావడం ఇదే మొదటిసారి అని డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. ఇలాంటి కేసులు చాలా అరుదని అన్నారు. అందుకే ఎప్పుడూ కూడా బలవంతంగా నోరు తెరువకూడదని, ఆహారాన్ని మెల్లగా తినాలని సూచించారు.