Bangladesh Crisis | ఢాకా, ఆగస్టు 10: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు, సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామాకు ఒత్తిడి చేసి విజయవంతమైన నిరసనకారులు మిగతా ప్రధాన పదవుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్నారు. శనివారం ఉదయం వందలాది మంది నిరసనకారులు, విద్యార్థులు, న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి చేరారు. గంట సేపట్లో ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయాలని, లేకపోతే న్యాయమూర్తుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. న్యాయమూర్తుల భద్రత దృష్ట్యా తాను రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. హసన్ రాజీనామా తమకు అందిందని పార్లమెంటరీ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఫేస్బుక్లో ప్రకటించారు. ఒబైదుల్ హసన్ తర్వాత మరో ఐదుగురు న్యాయమూర్తులు సైతం రాజీనామా చేశారు. కాగా, సుప్రీంకోర్టు ఫుల్ మీటింగ్ నిర్వహించేందుకు ప్రధాన న్యాయమూర్తి సిద్ధమయ్యారని, తాత్కాలిక ప్రభుత్వం చట్టవిరుద్ధమని ఆయన ప్రకటించాలని అనుకున్నారని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు, బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ రౌఫ్ తాలుక్దర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు బ్యాంకు ప్రాంగణంలో ఆందోళన చేశారు. ఢాకా యూనివర్సిటీ వీసీ మక్సూద్ కమల్, ఎస్‌యూఎస్‌టీ వీసీ ఫరీదుద్దిన్ అహ్మద్ సైతం రాజీనామా చేశారు.
మేమూ బెంగాలీలమే…
తమపై దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమపై, తమ ఆలయాలు, ఇండ్లపై జరుగుతున్న దాడులకు నిరసన తెలిపారు. తామూ బెంగాలీలమే అని, హిందువులకు కూడా బంగ్లాదేశ్‌లో నివసించే హక్కు ఉందని పేర్కొంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హసీనా రాజీనామా తర్వాత హిందువులపై దాడులు జరిగాయి. ఒక హిందూ స్కూల్ టీచర్, ఇద్దరు కౌన్సిలర్లను అల్లరిమూకలు హతమార్చాయి. హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఖండించారు. దాడులు హేయమైనవని, హిందూ, క్రైస్తవ, బౌద్ధ కుటుంబాలకు రక్షణగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
‘హసీనాతో బలవంతంగా రాజీనామా చేయించలేదు’
షేక్ హసీనా రాజీనామా చేయలేదని, తలపై తుపాకీ గురిపెట్టి..పదవీ నుంచి దింపేశారని ఆమె కుమారుడు సాజీద్ వాజెద్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల్ని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) జనరల్ సెక్రెటరీ మీర్జా ఫక్రూల్ అలంగిర్ ఖండించారు. శనివారం భారత్‌కు చెందిన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఉండటమా? దేశాన్ని వీడటమా? అనే రెండు ఎంపికలు ఆ రోజు హసీనా ముందు ఉన్నాయని, దేశాన్ని వీడాలన్నది ఆమె నిర్ణయమని అలంగిర్ అన్నారు. మాజీ ప్రధాని ఖలీదా జియా ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారని, ఆమె ఆరోగ్యం కుదటపడ్డాక ఎన్నికల్లో బీఎన్పీకి నేతృత్వం వహిస్తారని అన్నారు. దేశంలో హింస, అల్లర్లు హఠాత్తుగా సంభవించిన ఘటనలుగా పేర్కొన్నారు. తమ దేశ మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం ఇచ్చే ముందు భారత దేశం ఆలోచించుకోవాలని అలంగిర్ అన్నారు. ఆమెకు ఆశ్రయం ఇవ్వడం వల్ల ప్రజల మధ్య సంబంధాలపై ప్రభావం పడుతుందని.. అన్ని దేశాలూ మనకు మిత్రులు కావాలని అన్నారు.