శనివారం 11 జూలై 2020
Hyderabad - Jun 03, 2020 , 02:08:00

మరో రెండు జీహెచ్ఎంసీ డంప్ యార్డులు ఏర్పాటు..

 మరో రెండు జీహెచ్ఎంసీ డంప్ యార్డులు ఏర్పాటు..

హైదరాబాద్ : నగరంలో వెలువడే వ్యర్థాలను ఒకేచోటకు కాకుండా నగరానికి నలుమూలలా తరలించి కాలుష్యం సృష్టించని విధంగా ఆధునిక డంప్‌యార్డులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎంతో కాలంగా పెండింగులో ఉంది. ఇందులో భాగంగా గతంలో నాలుగు ప్రాంతాల్లో 470 ఎకరాలు గుర్తించగా, అందులో ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో 250 ఎకరాల స్థలం మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో దుండిగల్‌ ప్యారానగర్‌లో 150 ఎకరాలు కాగా, పటాన్‌చెరులోని లక్డారంలో 100 ఎకరాలు ఉంది. 

జనావాసాల నుంచి కాకుండా..

ప్యారానగర్‌లో 150 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ ఇటీవలే జీహెచ్‌ఎంసీకి బదలాయించారు. ఈ స్థలానికి వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. జనావాసాల నుంచి కాకుండా ఇతర ప్రాంతం నుంచి వెళ్లే విధంగా రోడ్డు ఏర్పాటు చేసేందుకు సుమారు అర కిలోమీటరు మేర అటవీశాఖకు చెందిన స్థలాన్ని సేకరించాల్సి ఉండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ శాఖకు లేఖ రాశారు. దీనికి అటవీశాఖ ఆమోదం తెలిపింది. త్వరలోనే అధికారికంగా అనుమతి జారీ అయ్యే అవకాశముందనీ, ఆ వెంటనే రోడ్డు ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఇక లక్డారంలోని 100 ఎకరాల స్థలం విషయానికొస్తే, ఈ స్థలాన్ని మొదట్లో డంప్‌యార్డు కోసం జీహెచ్‌ఎంసీ ఎంపిక చేసినప్పటికీ అనంతరం జిల్లా కలెక్టర్‌ దీన్ని రాజీవ్‌ స్వగృహ గృహాల నిర్మాణం కోసం హౌసింగ్‌ బోర్డుకు కేటాయించారు. ప్రస్తుతం రాజీవ్‌ స్వగృహ పథకం లేకపోవడంతో ఆ స్థలాన్ని తమకే కేటాయించాలని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కాగా, హౌసింగ్‌ బోర్డు అధికారులు మాత్రం ఆ స్థలాన్ని తమ ఆధీనంలోనే ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

  జవహర్‌నగర్‌ యార్డుకు 6000 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు..

 మరోవైపు, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల ప్రకారం వ్యర్థాలను ఒకేచోటకు కాకుండా నలువైపులా తరలించి శాస్త్రీయ పద్ధతుల్లో డిస్పోజ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో రోజూ వెలువడుతున్న 6000 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను జవహర్‌నగర్‌ డంప్‌ యార్డుకు తరలిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ నేపథ్యంలో డంప్‌యార్డు కోసం స్థలాల ఆవశ్యకత ఎంతో ఉంది. అందుకే లక్డారంలోని 100 ఎకరాల స్థలాన్ని డంప్‌ యార్డుకు కేటాయించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దీనిపై నిర్ణయం వెలువడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ స్థలాన్ని జీహెచ్‌ఎంసీకి బదలాయిస్తే జవహర్‌నగర్‌కుతోడు మరో రెండు డంప్‌యార్డులు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం జవహర్‌నగర్‌ డంప్‌యార్డుకు తరలుతున్న వ్యర్థాల్లో సగానికిపైగా ఈ రెండు యార్డులకు తరలించే వీలు కలుగుతుంది. ఫలితంగా జవహర్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. 

వ్యర్థాల గుట్టలతో పేరుకుపోయిన జవహర్‌నగర్‌ డంప్‌యార్డు..

 జవహర్‌నగర్‌లోని సుమారు 360 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డుకు దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నగర వ్యర్థాలను తరలిస్తున్నారు. దీంతో అది వ్యర్థాలతో దాదాపు నిండిపోయే పరిస్థితికి చేరుకున్నది. దాదాపు 130 ఎకరాల విస్తీర్ణంలో నిండిపోయిన వ్యర్థాల గుట్టలకు ప్రస్తుతం క్యాపింగ్‌ పనులు నిర్వహిస్తున్నారు. దీనిపై తదుపరి వ్యర్థాలు వేసే ఆస్కారం లేదు. మిగిలిన 200 ఎకరాల్లో చాలా కాలంగా వ్యర్థాలు వేస్తున్నారు. అయితే శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల సెగ్రిగేషన్‌, ల్యాండ్‌ఫిల్‌ చేపట్టడంవల్ల మరికొంతకాలం పాటు ఈ డంప్‌ యార్డును ఉపయోగించుకునే ఆస్కారం ఉంది. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు కాకున్నా సమీప భవిష్యత్తులో ప్రత్యామ్నాయ డంప్‌యార్డుల ఏర్పాటు అనివార్యం. ఆధునిక డంప్‌ యార్డులను ఏర్పాటు చేయడంవల్ల కాలుష్యం తగ్గడం ఒక ఎత్తయితే, నగరానికి ఇరువైపులా డంప్‌ యార్డులు ఏర్పాటు చేయడం వల్ల రవాణా ఖర్చులు, నిర్వహణ వ్యయం చాలా వరకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. 

కాలుష్యం లేని డంప్‌ యార్డులకు ప్రణాళిక

 కొత్తగా ప్రతిపాదిత డంప్‌ యార్డు స్థలాల్లో మున్సిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనల ప్రకారం ఆధునిక పద్ధతుల్లో వ్యర్థాలను నిర్వహించాలని అధికారులు నిశ్చయించారు. ఇందులో భాగంగా చెత్తను తడి, పొడి చెత్తగా విడదీయడంతో పాటు ప్లాస్టిక్‌ను, ఇతర పనికొచ్చే వ్యర్థాలను విడదీయడం, అలాగే తడి చెత్తను కంపోస్ట్‌ తయారీకి, విద్యుత్‌ తయారీకి వినియోగించడం, పొడి చెత్తను రీ సైక్లింగ్‌ ద్వారా పునర్‌ వినియోగంలోకి తేవడం.. తదితర చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇలా జీరో వేస్ట్‌ విధానాన్ని అనుసరించాలని, ఇంకా మిగిలిన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో ల్యాండ్‌ఫిల్‌ చేయాలని నిశ్చయించారు. అంతేకాకుండా, డంప్‌యార్డు చుట్టూ పచ్చదం పెంచడంతో పాటు ఏ రోజు వ్యర్థాలను ఆరోజే డిస్పోజ్‌ చేసే విధంగా కార్యప్రణాళికలు రూపొందించారు.logo