Sajjanar | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీది కీలక పాత్ర అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక భూమిక పోషించారని తెలిపారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ జీవితాలను, ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక తెలంగాణ కోసం ఆర్టీసీ ఉద్యోగులు పోరాడారని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు ఆర్టీసీ ఉద్యోగులు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెను కొనసాగించారని.. 56,604 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషిచేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని బస్సు చక్రాలను ఆపడం వల్లే సకల జనుల సమ్మె ఉదృతమైందని.. విజయవంతం కూడా అయిందని అన్నారు. అనేక ఉద్యమాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమ పోరాట స్ఫూర్తిని చూపారని కొనియాడారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని ఉద్యోగులు చైతన్యపరిచారని గుర్తు చేశారు. కొందరు ఉద్యోగులు తమ పాటలు, రచనలు, నాటకాల ద్వారా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని.. రాష్ట్రం ఏర్పడేవరకు నిరంతరంగా ఉద్యమంలో ముందు వరుసలో ఉద్యోగులు నిలవడం సంస్థకు గర్వకారణమని ప్రశంసించారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని సజ్జనార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున అమరులకు ఘన నివాళులు అర్పించారు.
Sajjanar1
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గత 9 ఏండ్లలో టీఎస్ఆర్టీసీలో అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందని వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రజల ప్రోత్సాహం, అదరాభిమానాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెరుగైన, నాణ్యమైన సేవలను అందిస్తూ టీఎస్ఆర్టీసీ ముందుకు దూసుకుపోతోందని, భవిష్యత్‌లోనూ మరెన్నో కార్యక్రమాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. ప్రజల సహకారం, ఉద్యోగుల కృషితో టీఎస్ఆర్టీసీకి ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి
“CM KCR | ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచే దోపిడీకి గురైన తెలంగాణ: సీఎం కేసీఆర్”