Hyderabad | అమీర్ పేట్, ఫిబ్రవరి 8: ”మా కాలనీలో హాస్టళ్లను అనుమతించం”.. అంటూ కాలనీవాసులు ఏర్పాటు చేసిన బ్యానర్లు ఎస్సార్ నగర్లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో చర్చనీయాంశంగా మారింది. ఈ కాలనీలో హౌసింగ్ బోర్డ్ నిర్మించిన ఇండ్లన్నీ 100 గజాల లోపే.. ఇక్కడ రోడ్ల వెడల్పు కూడా తక్కువగా ఉండడంతో ఇవి కేవలం నివాసయోగ్యానికి తప్పితే ఎటువంటి వ్యాపార కార్యకలాపాలకు తావులేదు. అయితే ఈ మధ్య కాలనీలో లెక్కకు మించి హాస్టళ్లు ఏర్పాటు అవుతుండడం స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక్కడున్న మౌలిక వసతుల మేరకు కేవలం మూడు లేక నాలుగు కుటుంబాలు మాత్రమే ఒక్కో ఇంట్లో నివాసం ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో వెలసిన హాస్టళ్లతో ఒక్కో ఇంట్లో కనీసం 50 మందికి పైగా ఆశ్రయం పొందేలా నిర్మాణాలు జరుగుతుండడంతో కాలనీలో సమస్యలు మరింతగా పెరిగినట్టు తెలుస్తోంది.
అగ్గిపెట్టె లాంటి హాస్టల్ గదులలో ఇమడలేక అర్ధరాత్రుల వరకు యువకులు రోడ్లపైనే తిష్ట వేస్తుండడం, ఇరుకుగా ఉంటున్న ఈ రోడ్లపై లెక్కకు మించిన సంఖ్యలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తుండడం స్థానికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ విషయాలను అనేక పర్యాయాలు జిహెచ్ఎంసి, జలమండలి, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోతుందని స్థానికులు వాపోతున్నారు. హాస్టళ్ల నిర్వహణకు అవసరమైన అనుమతులను జిహెచ్ఎంసి, అగ్నిమాపక, జలమండలి, పోలీస్ విభాగాల నుండి పొందేందుకు అనుకూల పరిస్థితులు ఇక్కడ ఏమీ లేవని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే 10కి పైగా హాస్టళ్లను కాలనీలో నెలకొల్పారని, మరికొన్ని ఈ తరహాలోనే నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలుస్తోందని కాలనీ వాసులు చెబుతున్నారు. అయితే అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఈ తరహా నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీవాసులు త్వరలోనే జిహెచ్ఎంసి ఉన్నతాధికారులను కలిసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Murder | తాతను చంపిన మనమడు దొరికాడు.. ఎందుకు హత్య చేశాడో తెలుసా..?
Hyderabad | ఠాగూర్ ఆస్పత్రి సీన్ రిపీట్.. డెడ్ బాడీకి ట్రీట్మెంట్ ఇచ్చారని బాధితుల ఆందోళన!
NAAC | నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న న్యాక్.. కోర్సుల వివరాలివే..!