Murder | ఖైరతాబాద్, ఫిబ్రవరి 8 : తాతను కిరతకంగా చంపి తప్పించుకు తిరుగుతున్న మనుమడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమాజిగూడ డివిజన్లోని బీఎస్మక్తాలో నివాసం ఉండే వీసి జనార్ధన్ రావు (86)ను ఈ నెల 6న మనమడు కిలారు కీర్తీ తేజ (29) విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో పాటు అడ్డు వచ్చిన తల్లిపై కూడా దాడి చేశాడు.
ఈ ఘటనలో జనార్ధన్ రావు అక్కడికక్కడే మృతిచెందగా, తల్లిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చేర్పించారు. గత 48 గంటల నుంచి పరారీలో ఉన్న నిందితుడిని శనివారం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. తన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండడంతో ఒంటరి తనంతో కుంగిపోయినట్లు తేజ పోలీసులకు తెలిపాడు. దీంతో పాటు ఆస్తి విషయాల్లో తరచూ గొడవలు జరుగుతుండేవని చెప్పాడు. ఈ నేపథ్యంలో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పేర్కోన్నారు.