Hyderabad | మాదాపూర్, ఫిబ్రవరి (నమస్తే తెలంగాణ) 8: హైదరాబాద్‌లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డెడ్‌బాడీకి చికిత్స చేసి లక్షల్లో రూపాయలు దండుకున్నారు. ఈ విషయం తెలిసి బాధిత కుటుంబం ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
బాధితుల కథనం ప్రకారం… కడప జిల్లా రాజంపేటకు చెందిన సుహాసిని (26) డిగ్రీ పూర్తి చేసుకొని ఇంటి వద్దనే ఉంటుంది. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురవ్వడంతో జనవరి 10 వ తేదీన కడప జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పలు పరీక్షలు చేసిన వైద్యులు హైదరాబాద్ లేదా చెన్నై ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. దీంతో జనవరి 12వ తేదీన హైదరాబాద్‌కు వచ్చి మియాపూర్‌లోని సిద్ధార్థ న్యూరో హాస్పిటల్‌కు వెళ్లారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు చికిత్స చేసిన యాజమాన్యం రూ.13 లక్షల వరకు బాధితుల నుంచి దండుకున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి ఆస్పత్రి యాజమాన్యం మృతురాలి బంధువులకు కాల్ చేసి సీరియస్‌గా ఉందని చెప్పారు. వెంటనే రూ.5లక్షలు డబ్బులు కట్టి ఇక్కడి నుంచి తరలించాలని.. లేదంటే మాస్క్ తీసేస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన సుహాసిని కుటుంబసభ్యులు వెంటనే డబ్బుల కట్టి.. అంబులెన్స్‌లో నిమ్స్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్‌లో పేషెంట్‌ను తీసుకెళ్తున్న సమయంలో ఆస్పత్రి అటెండర్ మధ్యలోనే వదిలేసి వెళ్లారు. అక్కడే ఉన్న మరో వ్యక్తితో కలిసి నిమ్స్ ఆస్పత్రి తరలించారు. అక్కడ సుహాసినిని పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయిందని తేల్చారు. దీంతో సుహాసిని మృతదేహాన్ని తిరిగి సిద్ధార్థ్ న్యూరో ఆస్పత్రికి తీసుకొచ్చిన బంధువుల తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఇదే విషయంపై సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రి సీఈఓ డాక్టర్ వెంకటేశ్ నాయుడిని వివరణ కోరగా లీగల్ నోటీసు తీసుకుని వస్తే మాట్లాడుతా లేదంటే మాట్లాడనంటూ మీడియా మీద చిందులు తొక్కారు. నా వద్దకు ఎందుకు వచ్చారు.. మీకేం పని అంటూ దురుసుగా వ్యవహరించారు. కాగా, సిద్దార్థ్ న్యూరో దవఖానా సిబ్బంది తమపై భౌతిక దాడికి యత్నించారని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన మా చెల్లికి మూడు రోజులుగా వైద్యం చేశారని ఆరోపించారు. మూడు, నాలుగు రోజుల క్రితమే చనిపోయినా మాకు ఇప్పటి వరకు సమాచారం అందించలేదని.. మాకు న్యాయం చేయాలని సిద్ధార్థ హాస్పిటల్ పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.