న్యూఢిల్లీ, మార్చి 16: సుదీర్ఘకాలం బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్, బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వారిలో ఉన్నారు. మొత్తం 37 ఖాళీలకు గాను సోమవారం మూడు రాష్ర్టాల్లోని 11 రాజ్యసభ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. బీహార్, ఒడిశా, హర్యానాలోని 11 సీట్లకు మాత్రమే సోమవారం ఎన్నికలు జరిగాయి. మిగిలిన సీట్లకు సభ్యులు ఇదివరకే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేటి ఎన్నికల్లో తాను మద్దతు ఇచ్చిన ఒక ఇండిపెండెంట్తోసహా 8 స్థానాల్లో అధికార ఎన్డీఏ కూటమి విజయం సాధించింది.
బీజేడీ ఓ స్థానంలో గెలుపొందగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో హర్యానాలోని రెండు సీట్లలో ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రి రాందాస్ అథావాలే మార్చి 9న ఏకగ్రీవంగా ఎన్నికైన 26 మంది అభ్యర్థుల్లో ఉన్నారు. సోమవారం ఎన్నికల్లో బీహార్లోని ఐదు సీట్లు అన్నింటిలో ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందారు. నితీశ్ కుమార్(జేడీయూ), నితిన్ నబీన్(బీజేపీ), కేంద్ర మంత్రి రాంనాథ్ ఠాకూర్(జేడీయూ), ఉపేంద్ర కుష్వాహా(ఆర్ఎల్ఎం), శివేష్ కుమార్(బీజేపీ) గెలుపొందారు. ఎంఐఎంకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, బీఎస్పీ ఎమ్మెల్యే ఒకరి మద్దతు కూడా ఉన్నప్పటికీ ఆర్జేడీ సభ్యుడు అమరేంద్ర ధరీ సిసింగ్ ఓటమి పాలయ్యారు. ఒడిశాలోని నాలుగు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉండగా క్రాస్ ఓటింగ్ పుణ్యమాని బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు గెలుపొందారు.