సిద్దిపేట,ఆగస్టు 9: చదువుకు పేదరికం అడ్డుకాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ (న్యూస్) ఆధ్వర్యంలో దళిత విద్యార్థులకు ఆయన ప్రతిభ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో చదివితే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీటు సాధించి, ఫీజు కట్టలేని నిరుపేద దళిత విద్యార్థులను డాక్టర్లు చేసే బాధ్యత తీసుకుంటున్నానని గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లు ఇవ్వకపోవడంతో సర్టిఫికెట్లు రాక విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. దళిత, గిరిజన, బీసీ కార్పొరేషన్లు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, బడ్జెట్లో వేల కోట్లు కేటాయించినట్లు చూపిస్తున్న సర్కార్ ఒక రూపాయి ఖర్చు చేయడంలేదన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేదర్, బాబూ జగ్జీవన్‌రామ్ లాంటి మహనీయులు కల్పించిన రిజర్వేషన్లతోనే మనమంతా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నామన్నారు. ఆరిజర్వేషన్ల ఫలాలతో గౌరవంగా బతుకుతున్న మనం తిరిగి సమాజానికి ఏదో ఒకటి చేయాలనే బాధ్యతను పదేండ్ల క్రితమే గుర్తించి సిద్దిపేటలో మాదిగ సామాజిక వర్గం ఉద్యోగులంతా న్యూస్ సొసైటీని స్థాపించడం అభినందనీయమన్నారు. ఐదేండ్ల క్రితం ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న రోహిత్ అనే అబ్బాయికి ఇంజినీరింగ్‌లో సీటు ఇప్పించాలని, దానిని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు అతడు ఏడాదికి రూ.6 లక్షల జీతం సంపాదిస్తున్నాడన్నారు. శ్రీజ అనే దళిత విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు వస్తే ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే అండగా ఉన్నట్లు గుర్తుచేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించి, ఫీజు కట్టలేక ఇబ్బంది పడే దళిత బిడ్డలు ఎవరైనా వస్తే వాళ్లను డాక్టర్లు చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న న్యూస్ సొసైటీకి లక్ష ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నాడు కేసీఆర్ హయాంలో దళిత విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు, సిద్దిపేటలో ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ తీసుకువచ్చామన్నారు.
అంబేదర్ ఓవర్సీస్ సాలర్ షిప్, దళితబంధు లాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేశామన్నారు.కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు బడ్జెట్లో రూ.5,403 కోట్లు కేటాయించి, ఖర్చు పెట్టింది కేవలం రూ.74 కోట్లు మాత్రమేనన్నారు. మాదిగ, మాల, ఏకలవ్య, సేవాలాల్, కొమురమ్భీమ్, బీసీ కార్పొరేషన్లు అని పేర్లుపెట్టి కాగితాలకే పరిమితం చేశారు తప్పా ఆ కార్పొరేషన్లకు ఒక రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ హయాలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.19 వేల కోట్లు చెల్లించి పిల్లల చదువులకు ఆటంకం లేకుండా చూశామన్నారు. ఇప్పుడు డిగ్రీలు, ఇంజినీరింగ్ పూర్తయినా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో న్యూస్ అధ్యక్షుడు బాలరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.