V Srinivas Goud | తెలంగాణలో నీళ్లు, నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతోందని.. ఆంధ్రా నుంచి వచ్చి రావడంతోనే ఓ అధికారికి ఎక్సైజ్ శాఖ కమిషనర్ పదవి ఇచ్చారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రా అధికారులకు కీలక పోస్టింగ్స్ ఇచ్చి తెలంగాణ అధికారులను అవమానిస్తున్నారు. ఆ ఆంధ్రా అధికారి తీరు వల్ల తెలంగాణ అధికారుల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఆ ఆంధ్రా అధికారి తిట్ల దండకంతో తెలంగాణ ఉద్యోగులకు గుండె పోట్లు వస్తున్నాయి. బీసీ, ఎస్సీ , ఎస్టీలను కులం పేరుతో ఆ అధికారి దూషిస్తున్నాడు.
సోమిరెడ్డి అనే సిన్సియర్ అధికారి ఆ ఆంద్రా అధికారి తిట్లకు కుప్ప కూలిపోయారు..ఆయన ఇప్పుడు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రిజ్వి అనే అధికారి ఇప్ప్పటికే ఈ ప్రభుత్వం తీరుతో బలవంతంగా పదవీవిరమణ తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి దగ్గర ఓఎస్డీగా ఉన్న రిటైర్డ్ అధికారి అవినీతికి అంతే లేదు. కూకట్ పల్లిలో ఓ వైన్ షాప్‌లో ఆంధ్రా మద్యం దొరికింది. ఆంధ్రా మద్యం తెలంగాణలోకి ఎలా వచ్చింది..? ఆ మద్యాన్ని పట్టుకుని కొంత ఫైన్ వేసి లక్షల్లో లంచం తీసుకున్నారు.. ఈ లంచం నేరుగా మంత్రి ఓఎస్డీకే వెళ్లింది. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఈ అవినీతి ఇట్లా ఉంటె ఆంధ్రా అధికారుల పెత్తనం మరో వైపు తెలంగాణ ఉద్యోగుల పట్ల శాపంలా మారుతోందన్నారు.
తెలంగాణ ఉద్యోగుల పట్ల ఆంధ్రా అధికారుల వైఖరి మారకపోతే మరో ఉద్యమం వస్తుందని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఆంధ్రా ఉద్యోగుల పెత్తనం ఏమిటీ…? సోమిరెడ్డికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆంధ్రా అధికారి బూతులతో ఇక తాను ఉద్యోగం చేయనని ఆత్మగౌరవం ప్రదర్శించారు. తెలంగాణ ఉద్యోగులు సోమి రెడ్డి లాగా ధైర్యాన్ని ప్రదర్శించాలి. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తీస్తున్న ఆంధ్రా అధికారులకు తగిన బుద్ధి చెప్పాలి. ఉద్యోగులను వేధించిన ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్‌ను తక్షణమే విధుల నుంచి తప్పించాలి.. ఆయన ఎవరి రికమండేషన్‌తో ఆ పదవిలోకి వచ్చారో లోతుగా తెలుసుకుంటాం. ఏసీబీ తిమింగలాలను వదిలేసి చిరు ఉద్యోగుల మీద పడుతోంది.. ఎక్సైజ్ కానిస్టేబుళ్లను ఇష్టమొచ్చినట్టు బదిలీలు చేస్తున్నారు. ఆంధ్రా అధికారులకు గౌరవమిస్తే కుక్క చూపిన విశ్వాసం కూడా చూపడం లేదు . ఆంధ్రా అధికారులు తమ వైఖరి మార్చుకోవాలి. సోమిరెడ్డికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే భాద్యత అని హెచ్చరించారు.
ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ,కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ ,వాల్య నాయక్ ,రామచంద్ర నాయక్ ,సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ పాల్గొన్నారు.