ముంబై : టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి ప్రమాదంలో పడిందా? వన్డే జట్టులో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై నడిచిన నాటకీయ పరిణామాలే అగార్కర్ కుర్చీ కిందకు నీళ్లు తెచ్చాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మరో మూడు నెలల్లో అగార్కర్ పదవీకాలం ముగియనుండగా.. అతడిని కొనసాగించకూడదని బీసీసీఐ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా ప్రస్తుతం బీసీసీఐ సీఓఈ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగిస్తారని జాతీయ మీడియాలో చర్చ నడుస్తోంది.
వాస్తవానికి అగార్కర్ పదవీకాలం జూన్‌తోనే ముగిసినా బోర్డు మూడు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. కానీ గత నెలలో ఇంగ్లండ్ టూర్లో జరిగిన పరిణామాలు అతడినికి చెడ్డ పేరు తెచ్చాయి. రోహిత్‌ను వన్డేల నుంచి తప్పించాలని అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావించినట్టు అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది. అయితే, లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేకు ముందే ఈ సమాచారం బయటకు పొక్కింది. తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన రోహిత్ అద్భుత శతకం సాధించి సెలెక్టర్లకు, విమర్శకులకు గట్టి సమాధానమిచ్చాడు. ఈ పరిణామాలతో అసంతృప్తిగా ఉన్న బోర్డు పెద్దలు సెప్టెంబర్‌తో ముగియనున్న అగార్కర్ పోస్టును పొడిగించకూడదని నిర్ణయించినట్టు సమాచారం.
అగార్కర్ స్థానంలో లక్ష్మణ్‌ను ఎంపిక చేయడం బీసీసీఐకి అంత తేలికైన విషయంగా కనిపించడం లేదు. ఎందుకంటే బోర్డు చాన్నాళ్లుగా దేశంలోని ఐదు జోన్ల (నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్) నుంచి ఐదుగురు ప్రతినిధులను సెలెక్టర్లుగా నియమించే సంప్రదాయాన్ని పాటిస్తోంది. ప్రస్తుతం అగార్కర్ వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా లక్ష్మణ్ సౌత్ జోన్‌కు చెందినవాడు. కానీ, సౌత్ జోన్ కోటాలో ఇప్పటికే హైదరాబాదీ మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా సెలెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఓఝా పదవీకాలం 2027 వరకు ఉంది. ఒకే జోన్ నుంచి ఇద్దరు సెలెక్టర్లను ప్యానెల్లో కొనసాగించడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధం కావడంతో లక్ష్మణ్ నియామకానికి జోనల్ చిక్కుముడి ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఓఝాను పదవి నుంచి తప్పుకునేలా చూడటం లేదా జోనల్ నిబంధనను సడలించి లక్ష్మణ్‌కు ప్రత్యేక వెసులుబాటు కల్పించడం బీసీసీఐ ముందున్న మార్గాలు. మరి లక్ష్మణ్ కోసం బోర్డు తమ పాత సంప్రదాయానికి బ్రేక్ వేస్తుందా? అసలు గురువుగా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే పనిలో ఉన్న వీవీఎస్ సెలెక్షన్ కమిటీలోకి రావడానికి ఒప్పుకుంటాడా? అన్నది తేలాల్సి ఉంది.