జీహెచ్ఎంసీ అక్రమారులకు కామధేనువులా మారింది. సామాన్యుడి కష్టం అధికారులకు కాసులు కురిపించే వనరుగా మారింది. పైసలు ఇస్తేనే ఫైలు కదులుతుంది.. లేదంటే అటకెకుతుంది’ అన్న చందంగా కొందరు అధికారుల తీరుతో పౌరులు జీహెచ్ఎంసీ పనులంటేనే విసిగిపోతున్నారు. డెత్ సర్టిఫికెట్ నుంచి నిర్మాణ రంగ అనుమతులు…బిల్లుల చెల్లింపుల నుంచి మ్యూటేషన్ వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి చేరాల్సిన పన్నుల సొమ్మును కొందరు జలగల్లా పీల్చివేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, టాక్స్ ఇన్స్పెక్టర్ నుంచి డీసీలు, ఎస్ఈల వరకు ‘మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా ప్రజా సేవ చేయాల్సిన అధికారులు కమిషన్ ఏజెంట్లుగా అవతారమెత్తారు. ఇటీవల వరుసగా ఏసీబీ దాడుల్లో చిక్కుతున్న తిమింగలాలను చూస్తుంటే బల్దియాలో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో అర్థమవుతున్నది.
– సిటీబ్యూరో
కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఎస్ఈగా పనిచేస్తున్న చిన్నారెడ్డి, రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఆయనతో పాటు లంచం సొమ్మును వసూలు చేసిన ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ బాలసాని ప్రవీణ్ కుమార్ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్ సుమారు రూ. 1.40 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ఈ బిల్లులకు సంబంధించి ఎస్ఈ చిన్నారెడ్డి సదరు కాంట్రాక్టర్ను లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ. 15 లక్షలకు బేరం కుదిరింది. బాధిత కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం నగదు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఎస్ఈ చిన్నారెడ్డి (ఏవో-1), కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్ కుమార్ (ఏవో-2)లను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
మూసాపేట్ సరిల్లో సీనియర్ అసిస్టెంట్ ఎం. సునీత ప్రాపర్టీ ట్యాక్స్ మ్యుటేషన్ కోసం రూ. 30,000 డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. మ్యూటేషన్ (ఆస్తి మార్పిడి) కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి నుంచి రూ. 80వేల లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేసి , చివరకు గతేడాది జూలై 2వ తేదీన ఏసీబీకి చిక్కారు.