Fire Accident | హైదరాబాద్ : అగ్నిప్రమాదాలు హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి. నిన్న రాత్రి మాదాపూర్‌లో, శుక్రవారం ఉదయం నిజాంపేట్‌లో, మధ్యాహ్నం గుడిమల్కాపూర్‌లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గుడిమల్కాపూర్‌లోని ఓ కట్టెల గోదాంలో శుక్రవారం మధ్యాహ్నాం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 111 వద్ద ఈ ప్రమాదం జరిగింది. కట్టెల గోదాంకు ఓ వైపున మెకానిక్ షెడ్, మరో వైపున విద్యుత్ సబ్ స్టేషన్ ఉంది. అయితే మెకానిక్ షెడ్‌కు మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఇక మెకానిక్ షెడ్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను కూడా స్థానికులు బయటకు తీసుకొచ్చారు. సిలిండర్లకు కానీ, ఇటు విద్యుత్ సబ్ స్టేషన్‌కు కానీ మంటలు అంటుకుని ఉంటే భారీ ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
గురువారం రాత్రి మాదాపూర్‌లోని ఓ ఆటోమొబైల్ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. షోరూమ్‌లో ఉన్న 15 కార్లలో కొన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు అని పోలీసులు పేర్కొన్నారు.
బాచుపల్లి పరిధిలోని నిజాంపేట్‌లోని ఓ టిఫిన్ సెంటర్లో శుక్రవారం ఉదయం అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఎల్పీజీ సిలిండర్ లీకేజీ కారణంగానే మంటలు ఎగిసిపడినట్లు పోలీసులు భావించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో కొందరు మాత్రమే టిఫిన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అగ్నికీలలు ఎగిసిపడిన వెంటనే అందరూ భయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు.
ఇవి కూడా చదవండి..
Kidney Rocket | కిడ్నీ రాకెట్ కేసు.. సీఐడీకి అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం
KTR | కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు.. ఉన్న కంపెనీలు పోకుండా చూడండి! : కేటీఆర్