కొత్తూరు/నందిగామ, ఫిబ్రవరి 25 : రాష్ట్రంలో పేద ప్రజలు కూడా ఆత్మగౌరవంతో బతుకాలని అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టి ఎంతో మంది పేదలకు పంచింది. అయితే కొన్ని ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఆలస్యమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. ఇరికిరుకు గుడిసెల్లో నివసించే పేదలు ఇండ్లకు చుట్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను అప్పటి సర్కారు చేపట్టింది. కొత్తూరు మున్సిపాలిటీలో 60 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిచేశారు. కానీ వాటిని లబ్ధిదారులకు అందిస్తే ఎక్కడ బీఆర్ఎస్కు పేరు వస్తుందో అని కాంగ్రెస్ సర్కారు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. 21 ఇండ్ల పట్టాలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. మిగతా ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని.. వాటిని కూడా సాధ్యమైనంత త్వరలో అందజేస్తామని వివరించారు.
గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో నందిగామలో సుమారు రూ.6 కోట్ల పైచిలుకు నిధులతో 120 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులను ఎంపిక చేసి బ్లాకులను కేటాయించింది. అంతలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయలేదు. బుధవారం కొత్తూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. దీంతో నాటి కల నేడు సాకారం అవుతుండటంతో లబ్ధిదారులు అనందం వ్యక్తం చేశారు. త్వరలో అన్ని డబుల్ బెడ్రూం ఇండ్లకు అర్హులైన వారిని ఎంపిక చేసి డబుల్ బెడ్ ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు.