Harish Rao | హైదరాబాద్ : భారతీయ సంస్కృతి చాలా గొప్పది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన తెలిపారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
ప్రపంచంలోనే మన ఖైరతాబాద్ వినాయకుడు ఫేమస్. ఒకప్పుడు వినాయక చవితి అంటే ముంబై గుర్తుకు వచ్చేది.. కానీ ఇప్పుడు దేశమంతా ఒకటే మాట అంటున్నది.. ఖైరతాబాద్ గణేశ్ మహారాజ్‌కి జై అంటున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసే ఘనత మన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు దక్కింది. మనం ఇంట్లోనే చిన్న పూజ చేయాలంటేనే ఎన్నో ఇబ్బందులు పడుతాం. కానీ 70 ఏండ్ల నుంచి ఇంత భారీ స్థాయిలో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారంటే ఖైరతాబాద్ గణేశ్ నిర్వాహకుల కృషి గొప్పదని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భారతీయ సంస్కృతి చాలా గొప్పది. భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం ఉన్న సంస్కృతి మనది. మనకు ఏదైనా సమస్య వస్తే అందరం ఒక్కటై కదులుతాం.. అదే భారతీయ సంస్కృతి అని హరీశ్‌రావు తెలిపారు.
దసరా అయినా, దీపావళి అయినా, బతుకమ్మైనా, బోనాలైనా, శ్రీరామనవమి అయినా, వినాయక చవితి అయినా అందరం కలిసి గొప్పగా జరుపుకునే సంస్కృతి భారతీయులకు ఉంది. ఈ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనందరం వినాయక చవితి అనగానే ఒక జోష్ ప్రోగ్రామ్ అనుకుంటాం. కానీ ఎమోషన్ కూడా ఈ పండుగలో ఉంది. ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ దేశ ప్రజలందరినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలు స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపించాయి. ఆ సంస్కృతిని మనందరం కొనసాగిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ సంస్కృతిని కొనసాగిద్దామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
ఇవాళ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అకాల వర్షాలు, వరదలు రావడంతో ప్రజలు బాధ పడుతున్నారు. ఈ విఘ్నేశ్వరుడు రాష్ట్ర ప్రజలకు విఘ్నాలు తొలగించి, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నాను. కేసీఆర్ నాయకత్వంలో 9 ఏండ్ల పాటు గణేశ్ ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించుకున్నాం. అదే పద్ధతిలో నిమజ్జన వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే సంతోషంగా ఉందని హరీశ్‌రావు తన ప్రసంగాన్ని ముగించారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో.. అన్ని అడ్డగోలు హామీలు, కల్లబొల్లి మాటలు..! కేటీఆర్ ఫైర్
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం