Deviprasad | రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ 3,587 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సుమారు రూ.21.39 కోట్ల మేర బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 1,310 మందికి మాత్రమే రూ.7.98 కోట్లు అందాయి. ఇంకా 2,277 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.13.41 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు.
దశాబ్దాలపాటు బాలల సంక్షేమం, గర్భిణీలు, బాలింతల సేవలో అంకితభావంతో పనిచేసిన అంగన్వాడీ సిబ్బందికి పదవీ విరమణ అనంతరం రావాల్సిన ప్రయోజనాలను ఆలస్యం చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికే వృద్ధాప్యంలో ఉన్న అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను విడుదల చేసి, అర్హులైన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
అలాగే భవిష్యత్తులో పదవీ విరమణ పొందే సిబ్బందికి ఎటువంటి జాప్యం లేకుండా బెనిఫిట్స్ అందించేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నామన్నారు. మరో వైపు ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి 30 నెలలు దాటినా వేతనాలు పెంచలేదు.
కనీసం నెల వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. అప్ గ్రేడ్ అయిన మినీ అంగన్వాడీ టీచర్లకు వేతనాలు 14 నెలలుగా ఇవ్వడం లేదు. అంగన్వాడీ టీచర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.