KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పరిపాలనలో పదేండ్లు సంతోషంగా ఉన్న హైదరాబాద్ నగరం ఏడాది కాలంగా సమస్యలకు కేరాఫ్‌గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాజధాని వాసుల కష్టాలు తీర్చే వరకూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టరు అని కేటీఆర్ తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్‌లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఇవాళ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమై.. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా చర్చించారు. రోజురోజుకూ పెరిగిపోతున్న పారిశుధ్య సమస్య, తాగునీటి తండ్లాట, విద్యుత్ కోతలు, ట్రాఫిక్ సమస్య తదితర అంశాలపై చర్చించారు.
ఎండాకాలం రాకముందే అనేక ఏరియాల్లో వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్న సంగతిని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. వేళాపాళా లేని కరెంటు కోతలతో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. దీంతో పాటు బీఆర్ఎస్ పాలనలో సేఫ్ సిటీకి బ్రాండ్‌గా ఉన్న హైదరాబాద్, క్రైమ్ సిటీగా మారడం, మళ్లీ పెరుగుతున్న భూకబ్జాలతో పాటు గాలికొదిలేసిన లా అండ్ ఆర్డర్‌తో నగర ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న అభద్రతాభావంపై కేటీఆర్‌తో ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సమస్యల పరిష్కారం, నగర ప్రజలకు కలిగించాల్సిన భరోసాపై ఎమ్మెల్యేలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్లు ఇచ్చే వరకూ పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌కు పాలన చేతకాదని ప్రజలకు అర్థమైపోయింది, తెలంగాణ గ్రోత్ ఇంజిన్‌ను కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్పైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయిన హైదరాబాద్ ఏడాదికాలంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుందన్నారు. సీఎంగా కేసీఆర్ సారధ్యంలో హైదరాబాద్ సంతోషానికి చిరునామాగా ఉంటే.. నేడు రేవంత్ సర్కార్ పాలనా వైఫల్యంతో సవాలక్ష కష్టాలకు కేరాప్‌గా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ పాలన హైదరాబాద్ నగరానికి స్వర్ణయుగం అన్న కేటీఆర్, మెట్రో రైలు, సివరేజీ ప్రాజెక్టులు, ఐటీ వృద్ధి, ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు నగర రూపురేఖల్ని మార్చి దేశానికే గర్వకారణంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దామన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలుచేసిన సమగ్రమైన ప్రణాళికలతో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు చెక్కుచెదరకుండా ఉన్నాయన్న కేటీఆర్, ప్రస్తుత ప్రభుత్వానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని కాపాడాలన్న సోయి కూడా లేకపోవడం దురదృష్టకరం అన్నారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి వెళ్లినా కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొంటున్న దురావస్థ గురించే హైదరాబాదీలు చెబుతున్నారని ఎమ్మెల్యేలు కేటీఆర్‌కు వివరించారు. ప్రధానంగా బస్తీ వాసులు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా హైదరాబాద్‌లో అమలుకావడం లేదన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని పేదలు ఎదురు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయంలో హైదరాబాద్ రూపురేఖల్ని సమూలంగా మార్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ వాసుల విలువైన సమయాన్ని ఆదా చేసే విధంగా వందేళ్ళ ముందు చూపుతో పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టామని, కరోనా సమయంలో కూడా యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తిచేసి ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను హైదరాబాద్‌లో వాసులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. కొత్త రహదారుల నిర్మాణం, లింక్ రోడ్ల నిర్మాణంతో రద్దీ సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల్ని తీర్చి హైదరాబాద్ వాసుల అభిమానాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సంపాదించుకుందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వానికి తాము నిర్మించిన కట్టడాలు, నిర్మాణాల నిర్వహణ కూడా చేతకావడం లేదని విమర్శించారు.
దెబ్బతిన్న రోడ్లను కనీసం రిపేర్ చేయకపోవడంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యమయ్యాని మండిపడ్డారు. చెత్త సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్‌లో ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆటోల ప్రయోగంతో విప్లవాత్మకమైన ఫలితాలను సాధించగలిగామని కేటీఆర్ చెప్పారు. కానీ నేడు హైదరాబాద్‌లోని ఏ కాలనీకి వెళ్లి చూసిన ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి కనిపిస్తుందన్నారు. ఫలితంగా ఈగలు, దోమల సమస్య పెరిగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కంచెలు వేసి కాపాడిన ప్రభుత్వ పార్కులకు కూడా రేవంత్ సర్కార్ పాలనలో రక్షణ లేకుండా పోయిందని, అనేకచోట్ల కబ్జాలకు గురయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా సామర్థ్యంపై హైదరాబాద్ ప్రజలకు నమ్మకం లేదన్న కేటీఆర్, ఆయనకు పాలన చేతకాదనే నిజాన్ని హైదరాబాద్ వాసులు పూర్తిగా అర్థం చేసుకున్నారని చెప్పారు.
గత ఎన్నికల్లో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా హైదరాబాదీలంతా పదేళ్ల అభివృద్ధికి పట్టం కట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భారీ మెజారిటీలతో గెలిపించారని, హైదరాబాద్ ప్రజల నమ్మకానికి అనుగుణంగా వారి కష్టాలను తీర్చడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. హైదరాబాద్ వాసుల కష్టాలు తీర్చేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. రాష్ట్రానికి ఎకనామిక్ ఇంజన్ అయినా హైదరాబాద్ ఇమేజీ కాంగ్రెస్ పాలనలో దారుణంగా దెబ్బతిన్నదన్న కేటీఆర్, ఇది కేవలం హైదరాబాద్‌కే కాకుండా యావత్ రాష్ట్రానికి మంచిది కాదన్నారు. పదేళ్లపాటు దేశంలోనే మోస్ట్ లవబుల్ సిటీగా, లివెబుల్ సిటీగా అనేక ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో అగ్రభాగాన నిలిచిన హైదరాబాద్ గాడి తప్పిన పాలన కారణంగా నేడు విలవిలలాడుతోందన్నారు. తెలంగాణ గ్రోత్ ఇంజన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్పైనే ఉందని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. గ్రామసభలు, వార్డు సభల పేరిట మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సర్కార్, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్లు ఇవ్వాలని, లేకపోతే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణకు వెన్నుముక్కైన హైదరాబాద్ అభివృద్ధిని గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారుకు నగర ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..