వడ్డీ వ్యాపారంలో ఆరితేరిన ఖాకీ దంపతులు జనాన్ని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. తెర ముందు పోలీసాయన.. తెర వెనక ఆయన భార్య చేసే అక్రమ దందాలో సామాన్యులు సమిధలవుతున్నారు. మొదట మీరిచ్చే డబ్బులకు అధిక వడ్డీ చెల్లిస్తామని, అనతి కాలంలో రెట్టింపు చేసి ఇస్తామని తియ్యటి మాటలతో బురిడీ కొట్టించి రూ.కోట్లల్లో కూడబెట్టుకొని చివరికి చేతులెత్తేశారు. గతంలో వరంగల్‌లో వీరిపై కేసు నమోదు కావడంతో భూపాలపల్లికి మకాం మార్చగా.. ఇప్పుడు వారి దందా ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’గా నడుస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి, మార్చి 2 (నమస్తే తెలంగాణ); జనం అత్యాశను వారు క్యాష్ చేసుకుంటున్నారు. ఇచ్చిన డబ్బులను అతి తక్కువ కాలంలోనే రెట్టింపు చేసి ఇస్తామని ఆదిలో నమ్మించారు. డబ్బులను రెట్టింపు చేసి ఇచ్చారు. దీంతో మరింత నమ్మకం ఏర్పడింది. ఇది ఆ నోటా.. ఈ నోటా భూపాలపల్లి పట్టణమంతా పాకింది. డబ్బులు పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరిగిపోయింది. కొంతకాలం సజావుగానే సాగిన ఈ దందా రూ.లక్షలు దాటి రూ.కోట్లకు చేరింది. చివరికి చేతులెత్తేశారు.
ఇది ఏ చిట్‌ఫండ్ కంపెనీయో, ఫైనాన్స్ కంపెనీయో కాదు.. ఓ పోలీసాయన భార్య బాగోతం. తెర ముందు పోలీస్.. తెరవెనుక అతడి భార్య సాగించిన అక్రమ దందా ఇది. వరంగల్‌లో కేసు నమోదు కావడంతో మకాం భూపాలపల్లికి మార్చారు. ఇక్కడ సైతం తమ అక్రమ బిజినెస్‌ను ప్రారంభించగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వారి బాధితులు న్యాయం కోసం తిరుగుతున్నారు. అయితే పోలీసాయన కావడం, డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు లేకపోవడంతో బాధితులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. వడ్డీ వ్యాపారం కేసులో కటకటాల పాలైనా సదరు పోలీస్ మరింత ధైర్యంతో తమ దందాను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యథేచ్ఛగా సాగిస్తున్నారు. పలువురు బాధితులు ఈ విషయమై గతంలో భూపాలపల్లిలోని ఓ పోలీస్ అధికారికి చెప్పినా పట్టనట్లు వ్యవహరించారని బాధితులు వాపోతున్నారు.
మాటలతోనే బురిడీ
వరంగల్‌లో వడ్డీ వ్యాపారంలో ఆరితేరిన ఈ పోలీస్ దంపతులు అక్కడ అందినకాడికి దోచేసి కేసుల్లో ఇరుక్కున్నారు. అనంతరం ఏదోలా ఉద్యోగం సంపాదించిన సదరు పోలీస్ బదిలీపై భూపాలపల్లికి వచ్చాడు. వడ్డీ వ్యాపారంలో చేయి తిరిగిన ఆ దంపతులు భూపాలపల్లిలో దుకాణం తెరిచారు. మీరిచ్చే డబ్బులకు అధిక వడ్డీ ఇస్తామంటూ బిజినెస్ ప్రారంభించారు. సదరు పోలీస్ భార్య చెప్పే తీయటి మాటలకు ప్రజలు బుట్టలో పడ్డారు. ప్రారంభంలో అధిక వడ్డీ చెల్లించడంతో రూ. లక్షల్లో ఆమెకు వడ్డీకి ఇవ్వడం ప్రారంభించారు. సింగరేణి, ఆర్టీసీ ఉద్యోగులు, వ్యాపారులు, ఓ రెస్టారెంట్ యజమాని, సామాన్య ప్రజలు ఆమెకు పెద్ద ఎత్తున వడ్డీలకు డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు.
ఈ దందాను ఆమె అనతి కాలంలోనే జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. పెద్ద ఎత్తున డబ్బులు రావడంతో వడ్డీ, అసలు ఇవ్వడం ఆపేసింది. దీంతో ఇదేంటని ఆమె చుట్టూ తిరగడం ప్రారంభించారు. నష్టం వచ్చింది త్వరలోనే ఇస్తానని చెబుతూ దాటవేస్తోందని, గట్టిగా అడిగితే ఈ విషయం మా ఆయనకు తెలియదు.. తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని తమనే భయపెడుతున్నదని బాధితులు వాపోతున్నారు. మహిళ కావడంతో ఏంచేయలేక పోతున్నామని, అత్యాశకు పోయి.. బయటకు చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నామని చెప్పుకుంటున్నారు.