బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 13, 2020 , 00:22:18

కరోనాకు దూరంగా

కరోనాకు దూరంగా

  • కట్టడికి జాగ్రత్తలు తప్పనిసరి    
  • నిర్లక్ష్యం వహిస్తే వైరస్‌ సోకే ప్రమాదం   
  • బయటకు వెళ్తే నిబంధనలు పాటించాలి   

ప్రతి ఒక్కరూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి.  ప్రతిరోజూ అరగంట పాటు యోగా, ప్రాణయామం, మెడిటేషన్‌ చేయాలి. తులసి, దాల్చిన, బ్లాక్‌ పెప్పర్‌, ఎండు అల్లంతో హెర్బల్‌ టీ చేసుకొని తాగాలి. దానికి లెమన్‌ జ్యూస్‌ను కూడా జత చేసుకోవచ్చు.

అడుగు బయట పెట్టాలంటే భయం.. 

ఎక్కడ కరోనా సోకుతుందోనని.. ఇలాటి విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తతే పరమౌషధమంటున్నారు నిపుణులు.. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ..వైరస్‌ విస్తరించకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరి. బయటకు వెళ్లినప్పటి నుంచి ఇంటికొచ్చే వరకు వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌బారిన పడకుండా సురక్షితంగా ఉంటాం.

ఎప్పటికప్పుడు శుభ్రత!!

ఫ్లోర్‌ను 2 శాతం డిటెర్జెంట్‌ లేదా 0.2 శాతం లైజోల్‌ లేదా డెట్టాల్‌తో తుడవాలి. 70 శాతం ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్‌తో ప్రధాన డోర్‌, కాలింగ్‌ బెల్‌ను శుభ్రం చేసుకోవాలి. 

దుస్తులను రోజూ డిటర్జెంట్‌తో ఉతుక్కోవాలి. చేతులను కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో రుద్దుతూ.. శుభ్రం చేసుకోవాలి. అయితే ప్రతి సందర్భంలో శానిటైజర్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. బయటకు వెళ్లి వచ్చినప్పుడు, తినే ముందు కచ్చితంగా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.

డోర్లు ముట్టుకోకుండా

ఇంటికి వెళ్లిన అనంతరం వెంటనే తలుపులు ముట్టుకోకుండా కుటుంబ సభ్యులను పిలిచి డోర్‌ తెరిపించాలి. వెంట తీసుకెళ్లిన సామగ్రిని ఏదైన ప్రత్యేక ప్రాంతంలో ఉంచాలి. వాష్‌రూంకు వెళ్లి కనీసం 20 సెకన్ల పాటు చేతులు, ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. వీలైతే స్నానం చేయడం మంచిది. 

ఆరడుగుల దూరం

మార్కెట్లకు వెళ్లాల్సి వస్తే.. కచ్చితంగా ఎన్‌-95  లేదా సర్జికల్‌  మాస్క్‌ను ధరించాలి. ప్లాస్టిక్‌ స్లిప్పర్స్‌ వేసుకోవాలి. ఇతరులకు 6 ఫీట్ల దూరంలో ఉండాలి. ఎటువంటి వస్తువులు తాకొద్దు. చేతులను ముఖం, కండ్లకు తాకకుండా జాగ్రత్త వహించాలి.  శానిటైజ్‌ చేసుకోవాలి. మార్కెట్‌లో కొనుగోలు చేసిన వస్తువులు తీసుకొచ్చేటప్పుడు వాటికి తగలకుండా ప్లాస్టిక్‌ బకెట్‌ను వెంట తీసుకెళ్లాలి. 

లిఫ్ట్‌ కీ ప్యాడ్‌ను తాకొద్దు

వీలైనంత వరకు లిప్ట్‌ వినియోగించకపోవడమే మంచిది. మెట్ల మార్గమే ఉత్తమం. లిప్ట్‌ వాడాల్సివస్తే చేతులతో లిప్ట్‌ కీప్యాడ్‌ తాకకూడదు.  ఏదైన పేపర్‌తో చేతిని కవర్‌ చేసుకుని పుష్‌ బటన్‌ నొక్కాలి. బయటకు వచ్చాక వెంటనే ఆ పేపర్‌ను రెండో వైపు తాకకుండా డస్ట్‌బిన్‌లో వేయాలి.

ఉప్పు నీళ్లలో

మార్కెట్‌ నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను గోరువెచ్చని ఉప్పు నీళ్లలో వేయాలి. లేదా డిటర్జెంట్‌ నీళ్లతో శుభ్రంగా కడగాలి. అనంతర ఫ్రిజ్‌లో పెట్టాలి. పాల ప్యాకెట్లను సబ్బుతో       కడగాలి. 

ట్రాన్సాక్షన్‌ ముగిశాక

ఏటీఎం సెంటర్‌కి వెళ్లినప్పుడు కచ్చితంగా  కీబోర్డ్‌ను శానిటైజ్‌ చేయాలి. ట్రాన్సాక్షన్‌ పూర్తయ్యాక  చేతులు శుభ్రం చేసుకోవాలి. 

డిజిటల్‌ అలవాటు చేసుకోండి

కరెన్సీ ఉపయోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. డిజిటల్‌ చెల్లింపులే శ్రేయస్కరం. తప్పనిసరి పరిస్థితుల్లో నోట్లను ఉపయోగిస్తే వాటిని ఇస్త్రీ చేయడం మంచిది. నాణేలను కూడా శానిటైజ్‌ చేయాలి. అనంతరం చేతులు శుభ్రం చేసుకోవాలి.logo