జగదేవ్‌పూర్ ఏప్రిల్ 22: చికెన్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్ఐ చంద్రమోహన్ కథనం ప్రకారం ఉమ్మడి తూప్రా న్ మండలం వెంకటాపూర్ పీటీ గ్రామానికి చెందిన మహిపాల్‌రెడ్డి (40) మండలకేంద్రంలోని టీచర్స్ కాలనీలో ఉంటూ షెట్టర్ అద్దెకు తీసుకొని ఏడాదిన్నరగా చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. సెంటర్లో పనిచేయడానికి బీహార్‌కు చెందిన యువకులు కురాబల్, రూబల్లను 30 రోజుల క్రితం పనిలో చేర్చుకున్నాడు.
మృతుడు మహిపాల్‌రెడ్డి సాయంత్రం 4గంటల వరకు రాకపోయే సరికి భార్య మానస ఫోన్ చేసి త్వరగా రావాలని గుర్తు చేయగా చికెన్ ఆర్డర్ ఉంది పంపించి వస్తానని చెప్పాడని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9గంటలకు మృతుడి సోదరుడు శ్రీపాల్‌రెడ్డి ఫోన్ చేస్తే స్విచ్ఛా ఫ్ రావడంతో సెంటర్లో పని చేసే కురాబల్, రూబల్లకు ఫోన్ చేస్తే వారి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందన్నారు. పక్కన దుకాణాదారులకు ఫోన్ చేస్తే షాపు బంద్ చేసి ఉందని తెలిపారన్నారు. సోమవారం ఉదయం కుటుంబీకులు జగదేవ్పూర్కొచ్చి షెట్టర్ తెరిచి మహిపాల్‌రెడ్డి హత్య చేయబడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న గజ్వేల్ సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్ఐ చంద్రమోహన్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలించగా కాళ్లు, చేతులు వైర్లతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి దాడి చేసి చంపినట్లు గుర్తించారు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలు హార్డ్ డిస్కు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. వాటితోపాటు మద్యం బాటిళ్లు కాలిన సిగరెట్లు కనిపంచాయన్నారు. క్లూస్‌టీంతో క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు అందులో పని చేసే యువకులు పరారీలో ఉండటంతో వారే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కటుంబీకులు ఇచ్చన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.