Pregnancy | గర్భిణుల విషయంలో తొలి నెలలు అంటే ఏమిటి? ఆ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఏయే పనులు చేయవచ్చు. ఏమి చేయకూడదు? దాంపత్య జీవితానికి సంబంధించి భార్యాభర్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– ఓ పాఠకురాలు
గర్భధారణ సమయాన్ని వారాల లెక్కన కొలుస్తాం. మొత్తం గర్భధారణ సమయం.. నలభై వారాలు. అందులో మొదటి 12 వారాలను మొదటి త్రైమాసికంగా చెబుతాం. ఈ కాలాన్నే ‘తొలి నెలలు’గా పిలవవచ్చు. ఈ సమయంలోనే బిడ్డ అవయవాలన్నీ ఏర్పడతాయి. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఇది కీలక సమయం. అందుకే ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తాం. ఈ ఆమ్లం కనుక తక్కువైతే, పుట్టబోయే పాపాయికి నరాలు, గుండె, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే ప్రెగ్నెన్సీ వచ్చాకే కాదు, ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసే ఆరు వారాల ముందు నుంచే ఈ మాత్రలు వేసుకోవాలి. మరిన్ని ఇబ్బందుల్ని అధిగమించేందుకు బి6, బి12 మాత్రలు కూడా ఇస్తున్నాం. ఆహారం విషయానికొస్తే మొదటి నెలల్లో నీళ్లు ఎక్కువ తీసుకోవాలి.
ఆకుకూరలు, కూరగాయలు సమృద్ధిగా తినాలి. స్వీట్లు మితిమీర వద్దు. మసాలాలకు దూరంగా ఉండాలి. బయట ఫంక్షన్లకు వెళ్లడం, జబ్బులు వచ్చిన వాళ్ల దగ్గరికి వెళ్లి పలకరించడం లాంటివి చేయవద్దు. ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకితే బిడ్డకు ప్రమాదం. ఇక, సహజంగా వచ్చిన ప్రెగ్నెన్సీ అయితే చక్కగా రోజువారీ పనులు చేసుకోవచ్చు. ఆఫీసులకు వెళ్లొచ్చు. ప్రయాణాలు చేయవచ్చు. భార్యాభర్తలు ఎప్పటిలాగే దాంపత్య జీవితం గడపవచ్చు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పనేం లేదు. ఒకవేళ ఐవీఎఫ్లాంటి వాటి ద్వారా గర్భం ధరించినా, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్లు ఉన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మీరు సంప్రదించే గైనకాలజిస్టు చెబుతారు. వాటిని కచ్చితంగా పాటిస్తే సరిపోతుంది.
“Pregnancy | కాబోయే తల్లులకు అలర్ట్.. కడుపులో బిడ్డ ఆరోగ్యానికి ఐదు పండ్లు తినడం మస్ట్!”